నెల్లూరు జిల్లా జనసేన పార్టీలోని అలజడిని అధినేత పవన్ కల్యాణ్ గుర్తించారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక జనసేనలో వచ్చిన తొలి తిరుగుబాటు ఇది. నెల్లూరు జిల్లా ఇన్ చార్జ్ గా ఉన్న టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ తీరుని జిల్లాలోని కొందరు నేతలు ఎండగట్టారు. ఆయన వ్యవహారంపై తాడో పేడో తేల్చుకోడానికి ఏకంగా ఓ మీటింగ్ కూడా పెట్టుకున్నారు. మీటింగ్ తర్వాత అసంతృప్తులు మీడియాతో మాట్లాడినప్పుడు కూడా వేములపాటి అజయ్ పై విమర్శలు చేశారు. అదే సమయంలో తాము పార్టీకి మాత్రం కట్టప్పలమేనని తేల్చి చెప్పారు. విమర్శలు చేసిన నేతలు చోటా మోటా నేతలేం కాదు, ప్రస్తుతం పార్టీకి నియోజకవర్గ స్థాయిలో ఉన్న ఇన్ చార్జ్ లు, పార్టీలో కీలక పదవుల్లో ఉన్నవారే కావడం విశేషం. దీంతో అధినేత పవన్ కల్యాణ్ ఈ వ్యవహారంపై దృష్టిపెట్టారు. ఈ గొడవని మొగ్గలోనే తుంచేయాడానికి సిద్ధమయ్యారు. నెల్లూరు జనసేన నేతలకు కబురు పెట్టారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పంచాయితీ నిర్వహిస్తున్నారు.
అజయ్ సంగతేంటి?
వేములపాటి అజయ్ జనసేనలో సీనియర్ నేత, ప్రజారాజ్యం సమయం నుంచి ఆయనకు మెగా ఫ్యామిలీతో సత్సంబంధాలున్నాయి. పైగా నాగబాబుకి బాగా దగ్గర వ్యక్తి. దీంతో జనసేనలో ఆయన పలుకుబడి అమాంతంగా పెరిగిపోయింది. కార్పొరేషన్ పదవుల్లో కూడా ఆయనకు ప్రయారిటీ దక్కింది. టిడ్కో చైర్మన్ గా కూటమి ప్రభుత్వం అవకాశమిచ్చింది. నెల్లూరులో కూడా ఆయన పార్టీ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. అయితే కొంతమంది ఇన్ చార్జ్ లకు ఆయన వ్యవహార శైలి నచ్చలేదు. తమను కాదని, నియోజకవర్గ స్థాయిలో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారని వారు అనుమానిస్తున్నారు. ముసుగులో గుద్దులాట ఎందుకని భావించారో ఏమో ఏకంగా అసంతృప్తులంతా కలసి మీటింగ్ పెట్టుకుని అధిష్టానాన్ని అలర్ట్ చేశారు.
అజయ్ వర్గం ఎవరు..?
నెల్లూరు జిల్లాకు గతంలో జనసేన అధ్యక్షుడుగా మనుక్రాంత్ రెడ్డి ఉండేవారు. గత ఎన్నికల్లో ఆయన్ను వైసీపీ ఆకర్షించింది. నెల్లూరు ఎంపీగా పోటీ చేసిన విజయసాయిరెడ్డి, మనుక్రాంత్ కి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ ఎన్నికల ఫలితంతో అటు విజయసాయి రాజకీయ జీవితం ముగిసింది, ఇటు మనుక్రాంత్ కూడా తెరవెనక్కు వెళ్లిపోయారు. మనుక్రాంత్ రెడ్డి లేకపోవడంతో జిల్లా అధ్యక్ష పదవి ఖాళీగానే ఉంది. దీంతో పార్టీలో సహజంగానే ఆధిపత్య పోరు మొదలైంది. జిల్లాలో గునుకుల కిషోర్ కీలక నేతగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అటు దుగ్గిశెట్టి సుజయ్ బాబు కూడా పార్టీలో పెత్తనం కోరుకుంటున్నారు. ఈ క్రమంలో వేములపాటి అజయ్ తో కొందరికి విభేదాలు వచ్చాయి. వారంతా జట్టుకట్టి మీటింగ్ పెట్టుకుని, ప్రెస్ మీట్ పెట్టారు.
Also Read: వర్మ జీరో కాదు, హీరోనే..
బిగ్ టీవీ ఎఫెక్ట్..
సహజంగా ఇలాంటి అసంతృప్త మీటింగ్ లు పెద్దగా బయటకు రావు. కానీ జనసేనలో రభసను హైలైట్ చేసింది బిగ్ టీవీ. బిగ్ టీవీ కథనాలతో నెల్లూరు వ్యవహారంపై పార్టీ అధిష్టానం దృష్టిసారించింది. అసలు అజయ్ ని వ్యతిరేకించేవారి వాదన ఏంటి అనేది వినడానికి నేతలందర్నీ మంగళగిరికి పిలిపించారు పవన్ కల్యాణ్. అసంతృప్త నేతలకు క్లాస్ పీకి పంపిస్తారా, లేక అజయ్ కుమార్ నే సర్దుకోమని చెబుతారా..? పవన్ నిర్ణయం ఏంటి? నాగబాబు జోక్యం ఇందులో ఉంటుందా? వేచి చూడాలి.
Also Read: YCP కడుపు మంట పెరిగి పోతుందా?