Asifabad Crime: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాగజ్ నగర్ మండలం పరిధిలోని మోతుగూడ సమీపంలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వంకీడి మండలం బెండార గ్రామానికి చెందిన జగన్ (27).. దీపావళి పండుగ సందర్భంగా కాగజ్‌నగర్‌లోని వంజీరి గ్రామంలో ఉంటున్న తన అక్క అనుసూయ (32), మేనల్లుడు, ప్రజ్ఞశీల్ (4)లను బైక్‌పై ఎక్కించుకొని బెండారకు బయలుదేరారు. వారు మోతుగూడ సమీపంలోకి రాగానే వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన కారు వారి బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ భయానక ప్రమాదంలో జగన్, అనుసూయ, ప్రజ్ఞశీల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ALSO READ: RRC JOBS: ఇండియన్ రైల్వే నుంచి భారీ జాబ్ నోటిఫికేషన్.. టెన్త్, ఐటీఐ పాసైతే చాలు, డోంట్ మిస్
పండుగ వేళ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడంతో వంజీరి, బెండార గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో స్టేషన్ వద్ద బుల్లెట్ కలకలం.. రంగంలోకి దిగిన పోలీసులు