EPFO Withdraw Balance Rules: ఈపీఎఫ్ఓ ఇటీవల పీఎఫ్ విత్ డ్రా నిబంధనలలో మార్పులు చేసింది. చందాదారులు ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ ను చెక్ చేసుకునేందుకు కీలక మార్పును తీసుకువచ్చింది. పీఎఫ్ విత్ డ్రా విధానాన్ని సులభతరం చేసింది. విత్ డ్రాకు సంబంధించిన 13 నిబంధనలను మూడు వర్గాలుగా విలీనం చేసింది. కొన్ని సందర్భాల్లో డాక్యుమెంటేషన్ అవసరాన్ని తొలగించింది. ఈపీఎఫ్ఓ కొత్త నియమాలు ఉద్యోగులు తమ పీఎఫ్ ను సులభంగా యాక్సెస్ చేయడానికి, అలాగే పదవీ విరమణ పొదుపులను పొందడానికి ఉపయోగపడుతుంది.
ఈపీఎఫ్ఓ కొత్త నియమాలతో నిమిషాల్లో పీఎఫ్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు. పీఎఫ్ బ్యాలెన్స్ ను తనిఖీ చేసుకునే 5 సులభమైన విధానాల గురించి తెలుసుకుందాం.
EPFO పోర్టల్ లో UAN నమోదు చేసుకున్న సభ్యులు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి ‘9966044425’ కు మిస్డ్ కాల్ ఇస్తే మీ పీఎఫ్ బ్యాలెన్ వివరాలు ఫోన్ కు ఎస్ఎంఎస్ వస్తాయి. ఈ ఎస్ఎంఎస్ లో UAN, బ్యాంక్ ఖాతా నంబర్, ఆధార్, పాన్ నంబర్, సభ్యుడు చివరిసారి చెల్లించిన మొత్తంతో పాటు పూర్తి పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు ఉంటాయి. ఎస్ఎంఎస్ ద్వారా పీఎఫ్ వివరాలు పొందేందుకు ముందుగా ఈ కింది విధంగా చేయాలి.
1. చందాదారుడి మొబైల్ నంబర్‌ను ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో UANతో యాక్టివేట్ చేయాలి.
2. బ్యాంక్ ఖాతా నంబర్, ఆధార్, పాన్ ద్వారా కేవైసీ పూర్తి చేసి ఉండాలి.
2. SMS ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్‌ను తనిఖీ చేసుకోవడం
UAN యాక్టివేట్ చేసుకున్న చందాదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 7738299899కు SMS పంపి పీఎఫ్ బ్యాలెన్స్‌ను తనిఖీ చేయవచ్చు. అందుకు మీరు EPFOHO UAN (UAN నెంబర్) టైప్ చేసి పై నెంబర్ కు ఎస్ఎంఎస్ పంపాలి. ప్రాంతీయ భాషలో సమాచారాన్ని పొందడానికి UAN తర్వాత సంబంధిత భాషా కోడ్‌ను రాయాలి.
ఉదాహరణకు: హిందీ కోసం అయితే EPFOHO UAN HIN, తెలుగు కోసం EPFOHO UAN TEL అని ఎస్ఎంఎస్ పంపాలి.
మీరు స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తుంటే UMANG యాప్ ద్వారా ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను తనిఖీ చేసుకోవచ్చు. UMANG యాప్ లో లాగిన్ అయ్యి EPFO సేవలకు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందుకు మీరు పీఎఫ్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ను ముందుగా లింక్ చేసుకోవాలి. ఈ యాప్ లో పీఎఫ్ బ్యాలెన్స్ తనిఖీ చేసుకోవడంతో పాటు నేరుగా క్లెయిమ్‌లను అప్లై చేసుకోవచ్చు. పెన్షన్ లావాదేవీలు, పాస్‌బుక్ వివరాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
1. EPFO అధికారిక వెబ్‌సైట్ https://www.epfindia.gov.in సందర్శించండి
2. Employees ఆప్షన్ పై క్లిక్ చేయండి. దీనిలో సభ్యుల పాస్‌బుక్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
3. EPFO పోర్టల్‌లో UAN నెంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
4. లాగిన్ అయిన తర్వార నెలవారీ వాయిదాలు, యజమాని వాటా, మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్‌ను చూడవచ్చు.
పలు సంస్థలలో పనిచేసే ఉద్యోగులు ఈ పద్ధతులను ఉపయోగించి పీఎఫ్ ను తనిఖీ చేయలేరు. ఈ సంస్థలు తమ ఉద్యోగుల పీఎఫ్ ను అంతర్గతంగా నిర్వహిస్తుంటాయి. అటువంటి ఉద్యోగులు తమ నెలవారి శాలరీ స్లిప్‌ను తనిఖీ చేయడం ద్వారా, కంపెనీ ఉద్యోగుల పోర్టల్‌లో లేదా హెచ్ఆర్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్‌ను తనిఖీ చేయవచ్చు.
ఈపీఎఫ్ సభ్యులు ఇప్పుడు వారి పీఎఫ్ బ్యాలెన్స్‌లో 100 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. సొంత వాటాతో పాటు యజమాని వాటా రెండూ విత్ డ్రా చేసుకోవచ్చు. గతంలో యజమాని వాటా మాత్రమే పూర్తి విత్ డ్రాకు అనుమతించేవారు. పదవీ విరమణ లేదా నిరుద్యోగం వంటి కారణాలతో విత్ డ్రాకు అనుమతించేవారు. అయితే ఇప్పుడు ఉద్యోగులు తమకు అవసరమైనప్పుడు వారికి కేటాయించిన విభాగంలో 100 శాతం వరకు పాక్షిక విత్ డ్రా చేసుకోవచ్చు.
ఇటీవల జరిగిన సీబీటీ సమావేశంలో ఈపీఎఫ్ఓ విత్ డ్రా నిబంధనలను సడలించారు. విద్య అవసరాలకు 10 సార్లు వరకు, వివాహం కోసం 5 సార్లు వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. గతంలో పీఎఫ్ విత్ డ్రాకోసం వివిధ సర్వీసు పీరియడ్ పూర్తి చేయాల్సి ఉండేది. ఈపీఎఫ్ఓ కొత్త నియమాలు ప్రకారం సర్వీస్ కాలాన్ని 12 నెలలకు తగ్గించారు.
గతంలో ప్రకృతి వైపరీత్యాలు, నిరుద్యోగం లేదా అంటువ్యాధులు వంటి అత్యవసర పరిస్థితులకు సభ్యులు డాక్యుమెంటేషన్ అందించాల్సి వచ్చేది. దీంతో తరచుగా క్లెయిమ్ లు రిజెక్ట్ అయ్యేవి. ఇప్పుడు కొత్త ఈపీఎఫ్ఓ నియమాల ప్రకారం ఏ కారణం చెప్పకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈపీఎఫ్ఓ సభ్యుడు తన మొత్తం పీఎఫ్ లో 25% కనీస బ్యాలెన్స్‌గా మెయింటెన్ చేయాలి. దీనిపై 8.25% వడ్డీ ప్రయోజనం పొందుతాడు. మిగిలిన 75 శాతం పీఎఫ్ ను అత్యవసర అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు.
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఫైనల్ క్లెయిమ్ కాలాన్ని 2 నెలల నుంచి 12 నెలలకు పెంచింది. గతంలో 2 నెలలు నిరుద్యోగం ఉంటే మొత్తం పీఎఫ్ తీసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు తుది పెన్షన్ ఉపసంహరణకు 2 నెలల నుండి 36 నెలలకు పెంచారు. పదవీ విరమణ ప్రణాళికలో భాగంగా దీనిలో మార్పులు చేశారు.