Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్‌తో మోసపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. సామాన్యులనే కాదు.. ప్రజాప్రతినిధుల్ని బురిడీ కొట్టిస్తున్నారు కేటుగాళ్లు. ఏపీకి చెందిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌ను డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టిన సైబర్ నేరగాళ్లు కోటి రూపాయలకు పైగా కొట్టేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.
ముంబై సైబర్ క్రైమ్ అధికారులుగా నటించిన మోసగాళ్లు ..
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉంటున్న ఎమ్మెల్యేకు.. ఈ నెల 10న ముంబయి సైబర్ క్రైం బ్రాంచ్ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ కాల్ వచ్చింది. గౌరవ్ శుక్లా పేరుతో ఆయనకు ఫోన్ కాల్ వచ్చింది. ముంబయిలో మనీ లాండరింగ్ కింద ఆయనపై కేసు నమోదైందని.. యూనిఫాం వేసుకుని ఉన్న ఆ వ్యక్తి వీడియో కాల్‌లో బెదిరించాడు. నకిలీ ఆధార్, సిమ్ కార్డులతో బ్యాంకు ఎకౌంట్లు తెరిచి మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారంటూ భయపెట్టాడు.
సీబీఐ అరెస్ట్ వారెంట్ పేరుతో మరింత డబ్బుకు డిమాండ్..
ఆ తర్వాత సైబర్ క్రైమ్ అధికారి విక్రమ్‌గా పరిచయం చేసుకున్న మరో వ్యక్తి… సీబీఐ నుంచి అరెస్టు వారెంట్ వచ్చిందని వీడియో కాల్‌లో చూపాడు. తమ విచారణకు సహకరించకుంటే అరెస్ట్ తప్పదంటూ బెదిరించారు. తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలుగుతుందనే భయంతో.. పుట్టా సుధాకర్ యాదవ్ ఈ నెల 10, 15 తేదీల మధ్య మాయగాళ్ల ఖాతాలకు రూ.1.07 కోట్లు బదిలీ చేశారు.
Also Read: 40 మంది ప్రచార రథ సారథులు.. జూబ్లీహిల్స్ గడ్డపై కాషాయ జెండా ఎగురవేస్తారా..!
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ముగ్గురు అరెస్ట్..
కోర్టు నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇప్పించేందుకంటూ మరో రూ.60 లక్షలు ఇవ్వాలని నేరగాళ్లు డిమాండ్ చేశారు. దీంతో మోసపోయినట్లు గుర్తించి… సైబర్ క్రైమ్ పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సైబర్ నేరగాళ్లు ఆయనను డిజిటల్ అరెస్టు పేరుతో భయపెట్టినట్టు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. వారికి బ్యాంకు ఖాతాలిచ్చి సహకరించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ బ్యాంకు ఖాతాల్లోని రూ.16 లక్షలను ఫ్రీజ్ చేశారు.