వైసీపీ హయాంలో మూడు రాజధానులు అన్నప్పుడు కూడా వైజాగ్ కి ఇంత పేరు రాలేదు. ఇప్పుడు గూగుల్ ఏఐ సెంటర్ ఒప్పందం వల్ల వైజాగ్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారు మోగిపోతోంది. ఒప్పందం ఖరారైన రోజు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఏపీ ప్రభుత్వంతో జరిగిన ఒప్పందాన్ని చరిత్రాత్మక అభివృద్ధిగా చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ కూడా ఈ ట్వీట్ పై స్పందించడం విశేషం.
వైజాగ్ అందమైన నగరం..
తాజాగా సుందర్ పిచాయ్ ఓ ఇంటర్వ్యూలో వైజాగ్ అందమైన నగరం అంటూ మెచ్చుకున్నారు. వైజాగ్ ప్రత్యేకతను చాటేలా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వైజాగ్ కి చెందిన చాలామంది సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు ఆ వీడియోని పోస్ట్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వైజాగ్ ప్రజలు కూడా సుందర్ పిచాయ్ వీడియోని వైరల్ చేస్తున్నారు. తమ ప్రాంతంపై గూగుల్ సీఈఓ చేసిన వ్యాఖ్యలు ఇవీ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమెరికా వెలుపల గూగుల్ సంస్థ పెడుతున్న అతి పెద్ద పెట్టుబడి ఇదేనని గుర్తు చేశారు సుందర్ పిచాయ్. దక్షిణ భారత దేశానికి చెందిన ఓ సుందరమైన నగరం వైజాగ్ అని చెప్పారు.
?utm_source=ig_web_copy_link
ముఖచిత్రం మారిపోయేలా..
వైజాగ్ లో 15 బిలియన్ డాలర్లతో ఒక గిగా వాట్ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న డేటా సెంటర్, ఏఐ హబ్ పెడుతున్నామని తెలిపారు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్. ఈ గిగావాట్ ఎలక్ట్రిసిటీలో మేజర్ షేర్ క్లీన్ ఎనర్జీదేనని స్పష్టం చేశారు. సముద్ర గర్భం లోని కేబుల్స్ కి కూడా విశాఖ కేంద్రం అవుతుందన్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ తో ఆ ప్రాంతం యొక్క ముఖచిత్రం మారిపోయే అవకాశం ఉందని చెప్పారు సుందర్ పిచాయ్. గతంలో తాను వైజాగ్ లో పర్యటించినప్పటి అనుభవాలను ఆయన గుర్తు చేసుకోవడం విశేషం. ఒక వారం వ్యవధిలోనే వైజాగ్ గూగుల్ ఏఐ సెంటర్ గురించి రెండు సార్లు సుందర్ పిచాయ్ స్పందించారు.
రాజకీయ రచ్చ
ఇక ఏపీ రాజకీయాల్లో కూడా వైజాగ్ లో గూగుల్ సంస్థ ఏర్పాటు చేస్తున్న ఏఐ సెంటర్ హాట్ టాపిక్ గా మారింది. గూగుల్ ఏఐ సెంటర్ ని తమ ఘనతగా కూటమి ప్రభుత్వం చెబుతుంటే, ఉద్యోగ అవకాశాల విషయంలో వైసీపీ నేతలు విమర్శలు ఎక్కు పెట్టడం విశేషం. ఏఐ సెంటర్ వల్ల వైజాగ్ ఎకో సిస్టమ్ దెబ్బతింటుందని, విద్యుత్ కొరత ఏర్పడుతుందన్నారు. ఏఐ సెంటర్ వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయనే విషయంపై గూగుల్ తో ప్రెస్ నోట్ విడుదల చేయించాలని సవాల్ విసిరారు మాజీ ఐటీ మంత్రి గుడి వాడ అమర్నాథ్.
Also Read: YCP కడుపు మంట పెరిగి పోతుందా?
సుందర్ పిచాయ్ స్పందన సరిపోతుందా?
గుడివాడ అమర్నాథ్ ప్రశ్నకు సుందర్ పిచాయ్ స్పందన సరిపోతుందా అని కూటమి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. వైజాగ్ అభివృద్ధి గురించి నేరుగా సుందర్ పిచాయ్ చెప్పారని, ఆయన వ్యాఖల్ని కూడా వైసీపీ నేతలు నమ్మలేరా అని లాజిక్ తీస్తున్నారు. మొత్తమ్మీద వైజాగ్ గురించి సుందర్ పిచాయ్ చేసిన వ్యాఖ్యలు వైజాగ్ వాసులనే కాదు, ఏపీ ప్రజలందర్నీ సంతోషంలో ముంచెత్తాయి.
Also Read: పవన్ వద్దకు చేరిన నెల్లూరు జనసేన పంచాయితీ..