AP Students: విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తుంటాయి. ఆ పథకాలను అందిపుచ్చుకొని విద్యార్థులు.. విద్యాపథంలో దూసుకెళ్తుంటారు. ఈదశలోనే ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏపీలోని విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
2024-25 ఉపకార వేతనాలకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విద్యార్థులు ఈనెల 30వతేదీ లోగా దరఖాస్తులు సమర్పించాలని, లేనియెడల ఈ పథకానికి విద్యార్థులు అర్హులుకారంటూ ప్రభుత్వం వెల్లడించింది.
ఏపీ ప్రభుత్వం ప్రతి ఏడాది సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా డిగ్రీ నుండి పీజీ వరకు విద్యను అభ్యసించే విద్యార్థులకు ఉపకార వేతనాన్ని అందిస్తుంది. అది కూడా అన్ని రకములైన కోర్సులు తీసుకుంటున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఈ పథకానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులు అర్హులు. ఈ నేపథ్యంలో 2024-25 విద్యా సంవత్సరానికి రెన్యువల్ తో పాటు, నూతనంగా స్కాలర్ షిప్ కు దరఖాస్తులు చేసే వారికి కూడా అవకాశం కల్పించింది ప్రభుత్వం.
ఈ విషయాన్ని ఆయా కళాశాలల యాజమాన్యాలు గుర్తించి http://jnanabhumiv2.apcfss.in లో లాగిన్ కావాలని కోరారు. ఈ లాగిన్ ద్వారా విద్యార్థుల వివరాలు పూర్తి స్థాయిలో నమోదు చేయాలని, రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈనెల 30వ తేదీ లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. అలాగే అర్హత కలిగిన విద్యార్థులు కూడా ఈ విషయాన్ని గమనించి, తమ వివరాలు నమోదయ్యాయో లేదో కూడా సరిచూసుకోవాలన్నారు.
ఇలా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ పరిధిలోని గ్రామ సచివాలయం వద్దకు వెళ్లి ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ను కలిసి ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరెందుకు ఆలస్యం.. మీరు అర్హులైతే వెంటనే దరఖాస్తు చేయండి.. అలాగే మీ సచివాలయాన్ని సందర్శించండి.