Bandi Sanjay: నేడు అటల్ మోదీ సుపరిపాలన బస్ యాత్ర విశాఖ పట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఘనంగా సాగనుంది. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో చేపట్టిన ఈ బస్ యాత్రకు.. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం భారీ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ప్రజలతో నేరుగా మమేకమై, కేంద్ర ప్రభుత్వ విజయాలను వివరించడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశ్యంగా నిలుస్తోంది.
ఈ బస్ యాత్రలో భాగంగా విశాఖపట్నం జిల్లాలో జరిగే కార్యక్రమానికి.. కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరు కానున్నారు. ఆయనతో పాటు బీజేపీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు బస్ యాత్రలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ సుపరిపాలనను ప్రజలకు వివరించనున్నారు. విశాఖ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో బస్ యాత్రకు ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశాయి. పార్టీ జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలతో నగరం పండుగ వాతావరణాన్ని సంతరించుకోనుంది.
ఇక అనకాపల్లి జిల్లాలో జరిగే బస్ యాత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ బస్ యాత్ర ఎపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ సారథ్యంలో కొనసాగుతోంది. ఆయన నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అటల్ మోదీ సుపరిపాలన బస్ యాత్రకు మంచి స్పందన లభిస్తోంది.
విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో బస్ యాత్రకు బీజేపీ భారీ స్వాగత ఏర్పాట్లు చేసింది. ప్రతి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రణాళికలు రూపొందించారు.
Also Read: పార్లమెంట్ ఎంపీల్లో కిరణ్ కుమార్ టాప్.. ఆ తర్వాతి స్థానాల్లో అసదుద్దీన్, గల్లా అరుణ
ఈ సందర్భంగా నాయకులు ప్రజలతో ముఖాముఖి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాల వల్ల సాధించిన ప్రయోజనాలను వివరించనున్నారు. ముఖ్యంగా అటల్ బిహారి వాజ్‌పేయి ఆశయాలు, ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలన విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యంగా పేర్కొంటున్నారు. బీజేపీ నాయకత్వం ఈ బస్ యాత్ర ద్వారా పార్టీ బలోపేతంతో పాటు ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.