శ్రీశైల దేవస్థాన పరిపాలన భవనంలో ఆలయ ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి 21వ ట్రస్ట్ బోర్డ్ సమావేశం జరిగింది. ఈ సమావేశం సుమారు 3 గంటలు కొనసాగింది . ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆలయ ఛైర్మన్ చక్రపాణి రెడ్డి వెల్లడించారు. మొత్తం 30 ప్రతిపాదనలను ప్రవేశపెట్టామని అందులో 28 ప్రతిపాదనలకు ఆమోదం పొందాయని చెప్పారు. ఒక ప్రతిపాదనను వాయిదా వేయగా మరొకటి తిరస్కరించామన్నారు.
శ్రీశైల పరివార ఆలయమైన శిఖరేశ్వరస్వామి వారి ఆలయ ఆర్చ్ గేట్, ప్రహారీ గోడ పెంచటానికి, బండపరుపు, సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.49 లక్షలు నిధుల విడుదలకు ఆమోదం తెలిపారు. క్షేత్ర పరిధిలో పలు చోట్ల సీసీ రోడ్లు వేయటానికి రూ. 29 లక్షలు ప్రతిపాదించారు. భక్తుల సౌకర్యార్థం 200 గదుల వసతి గృహ నిర్మాణానికి రూ. 52 కోట్లు అంచనా వేశారు.
క్షేత్రపరిధిలో ట్రాఫిక్, పార్కింగ్ సమస్య తగ్గించాలని ఛైర్మన్ చక్రపాణిరెడ్డి అన్నారు. టోల్గేట్, నందిసర్కిల్ ప్రీకాస్ట్ సెంటర్ డివైడర్లు ఏర్పాటు చేసేందుకు రూ. 38.50 లక్షలు ఆమోదం తెలిపామన్నారు. రాజుల సత్రం నుండి సిద్ధరామప్ప కొలను వరకు కొండలోయకు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు బ్రిడ్జి నిర్మించాలని నిర్ణయించామని వెల్లడించారు.
మల్లికార్జున సదన్ నుంచి టోల్ గేట్ వరకు టోల్ గేట్ నుంచి రామయ్య టర్నింగ్ వరకు ఫ్లై ఓవరు బ్రిడ్జి నిర్మించాలని ఛైర్మన్ తెలిపారు. సిద్ధిరామప్ప జంక్షన్ రహదారి విస్తరణ , కళ్యాణకట్ట మరమ్మతులకు ఆలయ బోర్డ్ రూ.28.50 లక్షలు కేటాయించిందన్నారు.
శివరాత్రి, ఉగాది ఉత్సవాలతోపాటు పలు అభివృద్ధి పనులకు రూ. 10 కోట్ల 54 లక్షలు కేటయించారు. క్షేత్ర ప్రచారంలో భాగంగా స్థలపురాణం, చరిత్ర, క్షేత్ర ప్రత్యేకతలను చిత్రాలతో కాఫీటేబుల్ బుక్ ప్రచురించాలని ఛైర్మన్ వివరించారు.