టీమిండియా ఆటగాళ్లలో వ్యక్తిగత రికార్డులకైతే కొదవలేదు. మ్యాచ్ లు గెలవడం, ఓడటం పక్కన పెడితే, ఈ సంప్రదాయం తొలి నాటి క్రికెట్ రోజుల నుంచి వస్తూనే ఉంది. అప్పట్లో కొందరు క్రికెటర్లు రికార్డుల కోసమే ఆడేవారనే అపప్రథ కూడా ఉండేది. కాకపోతే కాలం మారింది. ఇప్పుడివి క్రికెటర్లకి అలంకారమే కాదు, క్రికెట్ లో వారేం సాధించారో చెప్పడానికి, వారి భవిష్యత్ క్రికెట్ కి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన రికార్డ్ సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అతి తక్కువ బంతుల్లో 2000 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. 1163 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియ బ్యాటర్ ఆరోన్ ఫించ్ అయితే 1283 బాల్స్ లో సాధించి తర్వాత స్థానంలో ఉన్నాడు.
అయితే, 2000 పరుగులను సూర్య 56 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించాడు. అంతేకాదు విరాట్ కోహ్లీ రికార్డును కూడా సమం చేశాడు. కాకపోతే పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్ టాప్‌లో ఉన్నాడు. అతను 52 ఇన్నింగ్స్‌ల్లో 2000 పరుగులు సాధించాడు. అతని తర్వాత మహమ్మద్ రిజ్వాన్ ఉన్నాడు. ఆ తర్వాత మూడో స్థానంలో సూర్య ఉన్నాడు. అలాగే కేఎల్ రాహుల్(58) తర్వాత స్థానంలో ఉన్నాడు.
ఇకపోతే టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో కెప్టెన్ సూర్య నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. 107 ఇన్నింగ్స్‌ల్లో 4008 రన్స్‌తో కోహ్లీ టాప్‌లో ఉండగా.. 140 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ 3853,68 ఇన్నింగ్స్‌ల్లో రాహుల్ 2256, తర్వాత సూర్యకుమార్ యాదవ్ 2041 పరుగులతో ఉన్నాడు.
సూర్య కుమార్ యాదవ్ మరో విశేషం ఏమిటంటే సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ 20 మ్యాచ్ లో 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అలా ఆ దేశంపై నాలుగు ఆఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్ గా నిలిచాడు.