IND vs SA 2nd T20 : సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ 20 మ్యాచ్ లో ఎన్నో అంచనాల మధ్య టీమ్ ఇండియా ఆట ప్రారంభించింది. అయితే ఓపెనర్లు శుభ్ మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఇద్దరూ డక్ అవుట్ అయ్యారు. దీంతో మంచి బోణీతో టూర్ ప్రారంభించారని నెట్టింట కామెంట్లు వినిపించాయి. మొదటి టీ 20 వర్షార్షణం అయ్యింది. రెండో టీ 20కి కూడా వరుణుడి బెదిరింపుల మధ్య ప్రారంభమైంది.
టీమ్ ఇండియా 19.3 ఓవర్లలో 180 పరుగుల వద్ద ఉండగా వరుణుడు ఆటంకం కలిగించాడు. రింకూ సింగ్ ధనాధన్ సిక్సర్ తో స్టేడియంలో అద్దాలు బద్దలు కొట్టాడు. దీంతో ఆ మాత్రమైనా స్కోర్ సాధ్యమైంది. ఇక చివరి మూడు బాల్స్ ఉందనగా మ్యాచ్ ఆగిపోయింది. వర్షం తగ్గిన తర్వాత డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 15 ఓవర్లకి ఆటని కుదించారు. లక్ష్యం 152 పరుగులుగా నిర్దేశించారు. ఇంకా ఏడు బాల్స్ ఉండగానే సౌతాఫ్రికా లక్ష్యం చేధించి, రెండో టీ 20 లో విజయం సాధించింది.
టాస్ ఓడిన టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ ప్రారంభించింది. మొదటి ఓవర్ మూడో బంతికి యశస్వి జైస్వాల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రెండో ఓవర్ ఆఖరి బంతికి శుభ్ మన్ గిల్ వికెట్ల వద్ద దొరికిపోయాడు. ఇద్దరూ డకౌట్లు కావడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో టీమ్ ఇండియా ఆట కొనసాగించింది. అప్పటికి స్కోరు 2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 6 పరుగులు చేసింది.
శ్రేయాస్ అయ్యర్ ప్లేస్ లో వచ్చిన తిలక్ వర్మ 20 బాల్స్ లో 29 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 3 సిక్స్ లు, 5 ఫోర్ల సాయంతో 36 బాల్స్ లో 56 పరుగులు చేశాడు. అప్పటికి 13.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. వికెట్ కీపర్ జితేశ్ శర్మ (1) ఈసారి నిరాశ పరిచాడు.
ఇక అక్కడ నుంచి రింకూ సింగ్ విధ్వంసం స్టార్ట్ అయ్యింది. తను కొట్టిన ఒక సిక్సర్ కి స్టేడియంలో అద్దం బద్దలయ్యింది. అంటే ఎంత పవర్ స్ట్రోక్ ఆడాడో అర్థమవుతోంది. 39 బాల్స్ లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. చివర్లో రవీంద్ర జడేజా 14 బాల్స్ లో 19 పరుగులు చేసి అవుట్ అయ్యడు. 19.3 ఓవర్ల దగ్గర వర్షం రావడంతో మ్యాచ్ కి అంతరాయం ఏర్పడింది.
వర్షం తగ్గాక డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో మ్యాచ్ ని 15 ఓవర్లకి కుదించారు. 152 పరుగుల టార్గెట్ ఇచ్చారు. సౌతాఫ్రికా బౌలింగ్ లో గెరాల్డ్ కొయెట్జీ 3, ఏండిల్ తప్ప మిగిలిన వారందరూ తలా ఒక వికెట్ తీసుకున్నారు. లక్ష్య చేధనకు బ్యాటింగ్ కి దిగిన సౌతాఫ్రికా ఎక్కడా తగ్గేదే లేదన్నట్టు ఆడింది. ఓపెనర్ రీజా హేండ్రిక్స్ దంచి కొట్టాడు. 27 బాల్స్ లో 49 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కెప్టెన్ మారక్రమ్ 17 బాల్స్ లో 30 పరుగులు చేశాడు. డేవిడ్ మిల్లర్ 12 బాల్స్ లో 17 పరుగులు చేశాడు. అయితే చివర్లో త్రిస్టాన్ స్టబ్స్, ఏండిల్ లాంఛనం పూర్తి చేశారు. ఇంకా ఏడు పరుగులు ఉండగానే సౌతాఫ్రికా విజయం సాధించింది.
అర్షదీప్ సింగ్ వేసిన రెండో ఓవర్ లో ఎక్స్ ట్రాస్ తో కలిపి 24 పరుగులు వచ్చాయి. ఆ ఒక్క ఓవర్ మ్యాచ్ ని టర్న్ చేసిందనే చెప్పాలి. ఇక ఎంత కంట్రోల్ చేసినా సౌతాఫ్రికా బ్యాటర్లు ఆగలేదు. అజయ్ జడేజా మూడో ఓవర్ వేసి 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆ ఓవర్ లో రన్ అవుట్ ఒకటి వచ్చింది.
నాలుగో ఓవర్ లో ముఖేష్ కుమార్ హ్యాట్రిక్ ఫోర్లు సమర్పించుకున్నాడు. దీంతో నాలుగు ఓవర్లు ముగిసేసరికి 56 పరుగులకి 1 వికెట్ తో సౌతాఫ్రికా జెట్ స్పీడ్ తో వెళ్లింది. ఒకవైపు అడపాదడపా వికెట్లు పడినా లక్ష్యం దిశగా సౌతాఫ్రికా చకచకా సాగిపోయింది. చివరికి 7 బంతులు ఉండగానే 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసి లక్ష్యాన్ని చేరుకుంది.
భారత్ బౌలింగ్ లో మహ్మద్ సిరాజ్ 1, ముఖేష్ 2, కుల్దీప్ 1 వికెట్లు తీసుకున్నారు. రవీంద్ర జడేజా, అర్షదీప్ కి వికెట్లు పడలేదు. సిరాజ్ బౌలింగ్ లో వికెట్ కీపర్ క్యాచ్ మిస్ అయ్యింది. అది దొరికినా మ్యాచ్ లో పట్టు చిక్కేదనే కామెంట్లు వినిపించాయి.
ఇక మూడో టీ 20లోనైనా విజయం సాధించి, మరి సిరీస్ సమం చేస్తారో, లేక సంప్రదాయాన్ని అనుసరించి, ఎప్పటిలా అప్పగిస్తారో తెలీదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.