Bomb Threats: తిరుపతి నగరానికి బాంబు బెదిరింపులు మొన్నటి వరకు హడలెత్తించాయి. పోలీసులు కూడ ఎప్పటికప్పుడు అప్రమత్తమై, తనిఖీలను కూడ నిర్వహించారు. అయితే ఇటీవల ఈ బెదిరింపులకు ఫుల్ స్టాప్ పడిందిలే అనుకొనే లోగా మరో బాంబు బెదిరింపు ఇప్పుడు రాగా, తిరుపతి పోలీసులు అప్రమత్తమయ్యారు. అసలు ఇలాంటి నేరాలకు పాల్పడే వారిని పోలీసులు గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తాజాగా తిరుపతి ఎస్వీ అగ్రికల్చర్ యూనివర్శిటీకి బాంబు బెదిరింపులు వచ్చాయి. అదికూడ కళాశాల మెయిల్ కు రావడం విశేషం. గురువారం యూనివర్శిటీ మెయిల్ కు హ్యూమన్ ఐఈడీ బాంబు పేరుతో యూనివర్శిటీని పేల్చేస్తామంటూ మెయిల్ వచ్చింది. దీనితో యూనివర్శిటీ సిబ్బంది అప్రమత్తమై నేరుగా తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన యూనివర్శిటీకి చేరుకొని డాగ్ స్క్వాడ్ సాయంతో తనిఖీలు నిర్వహించారు. అలాగే బాంబ్ స్క్వాడ్ బృందం కూడ అణువణువు పరిశీలించారు.
ఆ తర్వాత మెయిల్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు.. కేరళ రాష్ట్రం నుండి మెయిల్ వచ్చినట్లు తెలిసింది. అయితే గతంలో తమిళనాడు రాష్ట్రం నుండి ఇదే రీతిలో మెయిల్ రాగా, అప్పుడు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తాజాగా వచ్చిన మెయిల్ ఫేక్ బెదిరింపు అంటూ పోలీసులు తేల్చారు. తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవిందు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. గత రెండు నెలల క్రితం తిరుపతి లోని పలు హోటళ్లకు కూడ ఇదే తరహా బెదిరింపులు వచ్చాయి. ఇటువంటి ఫేక్ మెయిల్స్, కాల్స్ చేసేవారి భరతం పట్టాలని ప్రజలు కోరుతున్నారు. కానీ పోలీసులు మాత్రం.. హుటాహుటిన పరుగులు తీస్తూ.. ఫేక్ కాల్స్ ని కొట్టిపారేయకుండా.. తమ తనిఖీలు కొనసాగిస్తున్నారు.
Also Read: Railway Rules: ట్రైన్‌లో మొబైల్ ఫోన్ ఛార్జింగ్.. ఈ రూల్స్ పాటించండి.. లేకుంటే?
అసలే కలియుగ ప్రత్యక్ష దైవం వెలసిన తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అటువంటిది తిరుమలకు ఆనుకొని ఉన్న తిరుపతికి ఇటువంటి కాల్స్, మెయిల్స్ రావడంతో పోలీసులు కూడ ఇటీవల నిఘా పెంచారు. మొత్తం మీద వీటి గుట్టు రట్టు చేసేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.