విశాఖపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పాలన గాలికి వదిలేసి కూటమి ప్రభుత్వం కేవలం అమరావతి చుట్టూ రాజకీయాలు చేస్తోందని ఆయన సంచలన విమర్శలు చేశారు. గిట్టుబాటు ధర లేక రైతులు, ఫీజు రియంబర్స్ మెంట్ అందక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా అటకెక్కించారని దుయ్యబట్టారు. అమరావతిలో కేవలం కాంక్రీట్ వేసి ఏదో గొప్ప పనులు చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారని.. అసలు క్షేత్రస్థాయిలో జరిగిన అభివృద్ధి శూన్యమని ఎద్దేవా చేశారు.
సీఎం ప్రచారానికి పరిమితం..
అమరావతి నిర్మాణం విషయంలో చంద్రబాబు కేవలం ప్రచారానికే పరిమితమయ్యారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. గతంలో 2014 నుండి 2019 మధ్య కాలంలో కేవలం ఐదు శాతం పనులు మాత్రమే చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో అమరావతి కోసం ఎంత ఖర్చు చేశారు..? ఎన్ని బకాయిలు చెల్లించారు వంటి వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. చదరపు అడుగుకి 14 వేల రూపాయల ఖర్చు చూపించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్మాణాల పేరుతో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయవద్దని హెచ్చరించారు. అమరావతిని త్వరితగతిన పూర్తి చేయాలని, లేనిపక్షంలో తమ పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ఆలోచిస్తుందని స్పష్టం చేశారు.
ప్రత్యేక హోదా ముచ్చటే లేదా..?
రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా గురించి కూటమి ప్రభుత్వం నోరు విప్పకపోవడంపై బొత్స తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి పది అమరావతి నగరాలతో పాటు ముంబై వంటి నగరాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంటులో ప్రత్యేక హోదా బిల్లు పెట్టించాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే చంద్రబాబును తామే స్వయంగా మెచ్చుకుంటామని తెలిపారు. విభజన హామీల సాధనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.
జగన్ మాట్లాడింది ఇదే..
అమరావతిని కేవలం ఒక ప్రాంతానికే పరిమితం చేయకుండా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందని బొత్స వివరించారు. జగన్ మోహన్ రెడ్డి ఎక్కడా అమరావతి వద్దని చెప్పలేదని.. కేవలం వికేంద్రీకరణను మాత్రమే కోరుకున్నారని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో అమరావతి రైతులకు కౌలు డబ్బులు ఎప్పుడూ ఆపలేదని గుర్తు చేశారు. శాసన మండలిలో అమరావతిపై చర్చకు వస్తామనే భయంతోనే ప్రభుత్వం మండలి సమావేశాలు నిర్వహించడం లేదని విమర్శించారు. అవాస్తవాలతో ప్రజలను మోసం చేయడం మానుకొని.. పరిపాలనపై దృష్టి సారించాలని బొత్స సత్యనారాయణ సూచించారు.
ALSO READ: రూ.225 కోట్లతో బాసర టెంపుల్ అభివృద్ధి.. మాస్టర్ ప్లాన్ రెడీ, సీఎం రేవంత్ కీలక ఆదేశాలు