Botsa Vs Lokesh: వైస్ ఛాన్సలర్ల రాజీనామాల వ్యవహారం మండలిని కుదిపేసింది. దీంతో అధికార టీడీపీ-విపక్ష వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. వీసీల చేత బలవంతంగా రాజీనామాలు చేయించారని విపక్ష నేత బొత్స ప్రస్తావించారు. దానికి మంత్రి లోకేష్ కౌంటరిచ్చారు. ఇరువురు నేతల మాటలతో మండలి ఒక్కసారిగా హీటెక్కింది.
మంగళవారం ఉదయం మండలి సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కొంతసేపు తర్వాత వీసీల రాజీనామపై మండలిలో రచ్చ జరిగింది. దీనిపై మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ వీసీల చేత బలవంతంగా రాజీనామా చేయించారనడానికి ఆధారాలు ఉన్నాయన్నారు. టీడీపీ నేతలు ఒత్తిడి చేయడంతో వీసీలు రాజీనామాలు చేశారని అన్నారు.
ఈ విషయాన్ని రాజీనామా లేఖల్లో వీసీలు ప్రస్తావించారని గుర్తు చేశారు బొత్స. దీనిపై అధికార ప్రభుత్వ మండిపడింది. బొత్స వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు మంత్రి లోకేష్. బెదిరిస్తే రాజీనామా చేసినట్టుగా ఏ ఒక్కరూ చెప్పలేదన్నారు.
వైసీపీ చేసిన ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ప్రివిలేజ్ కమిటీకి పంపాలన్నారు మండలి ఛైర్మన్‌ను మంత్రి లోకేశ్ కోరారు. వీసీల రాజీనామా లేఖల్లో బెదిరించినట్లు అనే పదం ఎక్కడా లేదన్నారు. గత ప్రభుత్వం నియమించిన వీసీలకు బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్ రాదని ఎద్దేవా చేశారు.వీసీల రాజీనామా లేఖల్లో బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయా? అని ప్రశ్నించారు.
ALSO READ: గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమిదే హవా
మొత్తం 17 మంది రాజీనామాలు చేశారన్నారు మంత్రి లోకేష్. 10 మంది పర్సనల్, నో రీజన్స్ అని రాశారు. అందులో ఇద్దరు ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని రాజీనామా చేసినట్టు చెప్పుకొచ్చారు. మరో ఐదుగురు ఇన్‌స్ట్రక్షన్ వచ్చాయని రాసుకొచ్చారు. ఫలానా వారు బెదిరించారని అందువల్లే తాము రాజీనామా చేశామని ఎక్కడ చెప్పలేదన్నారు.
జగన్ పుట్టినరోజు వేడుకలు వర్సిటీలో చేసిన వ్యక్తి ప్రసాద్‌రెడ్డి ఏ విధంగా వీసీ పోస్టు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. పార్టీ కోసం సర్వేలు చేయించిన ఘనత ఆయనకే చెల్లిందన్నారు సదరు మంత్రి. రాజీనామా చేసిన మరో వీసీ రాజారెడ్డి చెల్లెలు కోడలన్నారు. వీసీల పోస్టులకు 500 మంది అప్లై చేశారన్నారు. ఇంటర్ నేషనల్ యూనివర్సిటీల నుంచి ఏపీలో వర్సిటీలకు వచ్చేందుకు క్లూ కడుతున్నారని చెప్పారు.
అంతకుముందు ప్రశ్నోత్తరాలపై చర్చ వాడి వేడిగా జరిగింది. బీసీల సంక్షేమానికి నిధుల కేటాయింపుపై వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలకు మంత్రులు ధీటుగా రియాక్ట్ అయ్యారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ బీసీలకు గత ప్రభుత్వం తీవ్రంగా అన్యాయం చేసిందన్నారు. అమర్నాథ్ గౌడ్‌ను వైసీపీ ప్రభుత్వం ఎలా హత్య చేసిందో చర్చించేందుకు సిద్దమేనా అంటూ సవాల్ చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబు దిళితుడ్ని చంపి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేయలేదా? బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు తగ్గించారో ఆ పార్టీ సభ్యులు చెప్పాలని మంత్రి లోకేష్ డిమాండ్ చేశారు.
ఈ లోగా మంత్రి సవిత జోక్యం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన కేవలం 8 నెలల్లో రూ. 1977 కోట్లు స్వయం ఉపాధి పథకాలకే అమలు చేశామన్నారు. రూ. 200 కోట్లతో లక్షా రెండు వేల మందికి ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. బీసీల కోసం కార్పొరేషన్ల కింద సబ్సిడీపై రుణాలు ఇస్తున్నామన్నారు. 26 జిల్లాల్లో బీసీ భవనాలు కట్టబోతున్నామని వివరించారు.