TDP Victory: ఏపీలో జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి దుమ్మురేపింది. అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన ఎన్నికలు ఇవే. సింపుల్‌గా చెప్పాలంటే కూటమి తొమ్మిది నెలల పాలనకు ఇదొక పరీక్ష. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలను టీడీపీ కూటమి దక్కించుకుంది. మరొకటి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీని పీఆర్‌టీయూ గెలుపొందింది. ఈ ఎన్నికల్లో టీడీపీని ఓడించేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఎన్నికల్లో పోటీ చేయకుండా, మిగతా అభ్యర్థి మద్దతు ఇచ్చింది.
తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటును కూటమి కైవసం చేసుకుంది. టీడీపీ నుంచి పేరబత్తుల రాజశేఖర్ బరిలోకి దిగారు. తొలి రౌండ్ నుంచి అధిక్యత పెంచుకుంటూ వచ్చారు పేరాబత్తుల. చివరి రౌండ్ ముగసేసరికి పేరాబత్తుల రాజశేఖర్, పీడీఎఫ్ అభ్యర్థి వీరరాఘవులుపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. పేరాబత్తులకు 50 శాతంపైగా ఓట్లు రావడంతో ఆయన విజయం తేలికైంది.
గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 2, 18, 902 ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఎనిమిది రౌండ్లపాటు లెక్కింపు జరిగింది. చివరి రౌండ్ ముగిసేసరికి పేరాబత్తుల 50 శాతం పైగానే ఓట్లు సాధించారు. దాదాపు 700 మంది సిబ్బంది మూడు షిఫ్టుల కౌంటింగ్‌లో పాల్గొన్నారు. ఏపీలో జరిగిన మూడు ఎమ్మెల్సీ సీట్లకు గాను రెండింటిని టీడీపీ కూటమి గెలుచుకుంది. కృష్ణా-గుంటూరు నుంచి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం సాధించారు.
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ తరపున గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపొందారు. అక్కడ టీడీపీ మద్దతు ఇచ్చిన వర్మ ఓడిపోవడంతో టీడీపీ పనైపోయిందని వైసీపీ నుంచి విమర్శలు మొదలయ్యాయి. చివరకు గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది.
ALSO READ: పిఠాపురంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు
వైసీపీని దూరంగా పెట్టిన ఓటర్లు
వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనేది గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో స్పష్టమైంది. వైసీపీ పోటీలో లేనప్పటికీ పీడీఎఫ్ అభ్యర్థులకు మద్దతు ప్రకటించింది. వామపక్షాలతో కలిసి కొన్నిచోట్ల వైసీపీ నేతలు ప్రచారం చేశారు. వైసీపీపై అసంతృప్తితో పీడీఎఫ్ అభ్యర్థులవైపు మొగ్గు చూపలేదని ఫలితాల సరళిని చూస్తే తెలుస్తోంది. పోటీచేసి ఓడిపోయామని అనిపించుకోవడం కంటే పోటీకి దూరంగా ఉండటమే బెటరని భావించింది. చివరకు పీడీఎఫ్ అభ్యర్థుల కోసం విస్తృతంగా వైసీపీ క్యాడర్ ప్రచారం చేసింది. అయినప్పటికీ పట్టభద్రులు వైసీపీకి ఊహించని షాక్ ఇచ్చారు.
ఎవరీ పేరాబత్తుల రాజశేఖర్
1998లో దివంగత లోక్‌సభ స్పీకర్ బాలయోగి, పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆశీస్సులతో తెలుగుదేశంలో చేరారు. 2006లో తొలిసారి తన అదృష్టాన్ని ఆయన పరిక్షించుకున్నారు. తొలిసారి మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికలయ్యారు. 2014లో జెడ్పీటీసీగా విజయం సాధించి జిల్లా పరిషత్‌లో అడుగుపెట్టారు.
2024 ఎన్నికల్లో కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ ఆశించారు రాజశేఖర్. అయితే ఆ సీటు కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేనకు దక్కింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు గోదావరి ప్రాంతం నుంచి ఆయనకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చారు. అందులో విజయం సాధించారు.
ఐ.పోలవరం మండలం వేమవరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పాసయ్యారు. కాకినాడలోని ఆదర్శ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు. ట్రస్ట్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చేసిన ఆయన, పీవీఆర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు పేరాబత్తుల రాజశేఖర్.