Fans Offers Prayers: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 {Champions Trophy 2025} లో గ్రూప్ దశ మ్యాచ్ లు ముగిశాయి. ఇక ఈ టోర్నీలో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. నేడు దుబాయ్ లో టీమిండియా {India} – ఆస్ట్రేలియా {Australia} జట్లు సెమీస్ పోరులో తలపడబోతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీ ఫైనల్ లో ఈ రెండు జట్లమధ్య పోరు అభిమానులను కంగారెత్తిస్తోంది. టీమిండియాకి కంగారు గండం మరోసారి పొంచిఉంది. ఐసీసీ టోర్నీలలో భారత్ పై ఇప్పటివరకు ఆస్ట్రేలియాదే ఆధిపత్యం. కానీ ఈసారి రివేంజ్ తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది రోహిత్ సేన.
2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు ఓడింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 469 పరుగులు చేసింది. ఇక టీమిండియా 296 పరుగులకే ఆల్ అవుట్ అయింది. రెండవ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 270/8 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం చేజింగ్ లో భారత జట్టు 234 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత జట్టు 209 పరుగులతో ఓటమిని చవిచూసింది. ఇక 2023 వన్డే ప్రపంచ కప్ లో కూడా ఆస్ట్రేలియా ఈ కప్పుని ఎగరేసుకుపోయింది.
స్వదేశంలో జరిగిన ఈ వరల్డ్ కప్ లో ఫైనల్ వరకు వెళ్లిన టీమిండియా.. టైటిల్ పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. మొదట 240 పరుగులు చేసిన భారత జట్టు ఆల్ అవుట్ కాగా.. ఆస్ట్రేలియా కేవలం నాలుగు వికెట్లను కోల్పోయి టార్గెట్ ని ఛేదించింది. ఐసీసీ టోర్నీలు అంటేనే చాలు ఆస్ట్రేలియా చెలరేగిపోతుంది. అలాగే ఇప్పటివరకు ప్రపంచ కప్ లో భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య 14 మ్యాచ్లు జరగగా.. ఇందులో భారత్ 5 మ్యాచ్లలో గెలిచి, 9 మ్యాచ్లలో ఓడిపోయింది.
ఇక చాంపియన్స్ ట్రోఫీలో ఈ ఇరుజట్లు నాలుగు సార్లు ఢీకొనగా.. ఆస్ట్రేలియా రెండుసార్లు గెలుపొందింది. భారత్ ఒక్క మ్యాచ్ నెగ్గింది. అలాగే టి-20 ప్రపంచ కప్ లో ఆరు మ్యాచ్లలో భారత్ రెండు మ్యాచ్లలో గెలుపొంది, నాలుగు ఓడిపోయింది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ లో ఆస్ట్రేలియాను ఓడించి రివెంజ్ తీర్చుకోవాలన్నది భారత అభిమానుల కోరిక. కానీ టీమ్ ఇండియాకు ఆస్ట్రేలియా ప్లేయర్ హెడ్ కొరకరాని కొయ్యాలా మారాడు. ఇతడు రెండుసార్లు వరల్డ్ టైటిల్స్ ని టీమిండియా దగ్గర నుండి లాగేసుకున్నాడు.
ఇప్పుడు జరగబోయే సెమీఫైనల్స్ లోను హెడ్ నుంచి ప్రమాదం పొంచి ఉంది. హెడ్ ఆడితే ఒంటిచేత్తో ఆస్ట్రేలియాకు విజయాన్ని అందిస్తాడు. ఇతడిని ఎంత వేగంగా అవుట్ చేస్తారనే దానిపైనే భారత్ విజయ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. మరోవైపు హార్దిక్ పాండ్యాకి హెడ్ పై మంచి రికార్డు ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సెమీఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు గెలుపొందాలని దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు {Fans Offers Prayers} ఆలయాలలో పూజలు నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని ఆలయంలో భారత అభిమానులు.. ఆస్ట్రేలియాపై భారత జట్టు విజయం సాధించాలని పూజలు నిర్వహిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Fans offers prayers in Varanasi for Team India's Victory in today's Semifinal vs Australia. 🇮🇳 (ANI).
— Tanuj Singh (@ImTanujSingh) March 4, 2025