Mahabubabad Incident: మహబూబాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన 5 సంవత్సరాల బాలుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. కన్న తల్లే ఈ దారుణానికి పాల్పడిందని తేల్చారు. అంతకంటే ముందు చిన్న కుమారుడిని కూడా ఆమె కడతేర్చినట్టు గుర్తించారు.
అన్నదమ్ముల మృతి కేసులో ట్విస్ట్..
ఈ నెల 24వ తేదీన కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో 5 ఏళ్ల బాలుడు పందుల మనీష్ కుమార్ మెడకు నైలాన్ తాడుతో బిగించి అతి కిరాతకంగా హత్య చేసిన కసాయి తల్లి శిరీషను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నారాయణపురం గ్రామానికి చెందిన పందుల ఉపేందర్.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామానికి చెందిన శిరీష 7 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
భర్తతో పట్టించుకోవడం లేదని పిల్లల్ని చంపిన తల్లి..
కొంత కాలం సజావుగా సాగిన వీరి సంసారం గొడవలు మొదలయ్యాయి. అయితే తన భర్త తాగుడుకు బానిసయ్యాడని.. పిల్లలను పట్టించుకోవడం లేదని శిరీష ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు. తనపై భర్త ఉపేందర్‌కు అనుమానం ఉండేదని, తనను పట్టించుకోడని.. పిల్లల్ని కూడా తన దగ్గరకు రానివ్వకుండా చేసేవాడని విచారణలో తేలిందన్నారు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుందని.. పిల్లల్ని చంపి తరువాత తాను కూడా చనిపోదామని అనుకున్నదని తెలిపారు.
9 నెలల క్రితం సంపులో పడి నిహాల్ అనే బాలుడు మృతి..
ప్లాన్‌లో భాగంగా మొదట 15 జనవరి 2025న చిన్న కుమారుడు రెండేళ్ల నిహాల్‌ను నీటి సంపులో పడేసి కడ కడతేర్చింది. పెద్ద కుమారుడి మనీష్ కుమార్‌పై ఈనెల 24వ తేదీన హత్యకు స్కెచ్ వేసింది. ఆరోజు సాయంత్రం మనీష్ కుమార్ పడుకొని ఉండగా నైలాన్ తాడుతో మెడకు గట్టిగా చుట్టి హతమార్చిందని తెలిపారు.
Also Read: రూ. 20 లక్షల కరెన్సీ నోట్లతో వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు
తల్లి శిరీషను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రిమాండ్ విధించిన కోర్టు..
కొడుకు చనిపోయిన సంగతి తెలుసుకున్న తండ్రి వచ్చాడు. కుమారుడు మృతదేహాన్ని గమనించిన మెడపై ఉరి ఆనవాళ్లు కనపడటంతో అనుమానపడ్డాడు. విషయాన్ని వెంటనే పోలీసులకు తెలిపాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. పోలీసులు వారి శైలిలో విచారణ చేపట్టగా శిరీష ఇద్దరు కుమారులను హత మార్చిన విషయాలను బయటపెట్టింది. వెంటనే ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆమెకు రిమాండ్ విధించారు.