2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అమరావతి రాజధాని అంశం కీలక పాత్ర పోషించింది. అమరావతి ఏకైక రాజధాని అని చెప్పిన కూటమిని ప్రజలు ఆదరించారు. ఏపీని మూడు రాజధానులతో అభివృద్ధి చేస్తామని చెప్పిన జగన్ మాటల్ని ప్రజలు నమ్మలేదు. సో.. అమరావతి రాజధాని విషయంలో రాష్ట్ర ప్రజల ఆలోచన ఎలా ఉందనే విషయం ఎన్నికల ఫలితాలతో తేలిపోయింది. అధికారంలోకి వచ్చిన కూటమి కూడా రాజధాని నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆగిపోయిన పనుల్ని చక చకా పట్టాలెక్కించారు సీఎం చంద్రబాబు. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో సీఆర్డీఏ పరిధిలో నిర్మాణాలు మళ్లీ మొదలయ్యాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఈ దఫా చంద్రబాబు ఫోకస్ మొత్తం అమరావతిపైనే ఉంది అనుకుంటే పొరపాటే. ఆయనకు అంతకు మించి ఇష్టమైన ప్రదేశం మరొకటి ఉంది.
కుప్పం కంటే ఎక్కువగా..
అమరావతికంటే చంద్రబాబుకి ఇష్టమైన ప్రదేశం ఆయన సొంత నియోజకవర్గం కుప్పం అనుకుంటే పొరపాటే. కుప్పంకంటే ఎక్కువగా చంద్రబాబు ఇప్పుడు విశాఖపట్నంపై దృష్టి సారించారు. విశాఖపట్నంలో ఏసీఐఏఎం, భోపాల్ నేషనల్ లా యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఇప్పుడే కాదు ఇటీవల కాలంలో ఆయన చాలాసార్లు విశాఖ వెళ్లారు. ఆగస్ట్ 29న విశాఖలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, సెప్టెంబర్ 2న మరోసారి విశాఖ వచ్చి స్థానిక అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మళ్లీ ఇప్పుడు విశాఖలో పర్యటిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో ఆయన మూడుసార్లు విశాఖకు వచ్చారు. అంటే రాజకీయంగా ఆయన విశాఖకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు.
https://twitter.com/JaiTDP/status/1963868874677555501
అమరావతికంటే మిన్నగా..
వాస్తవం చెప్పాలంటే అమరావతికంటే ఇప్పుడు విశాఖపైనే చంద్రబాబు ఎక్కువ ఫోకస్ పెట్టారు. కేవలం అమరావతిపైనే ఫోకస్ పెట్టి 2014-2019 మధ్యకాలంలో చంద్రబాబు రాజకీయం చేశారు. కానీ ఫలితం తేడా కొట్టింది. జగన్ మూడు రాజధానులు అని చెప్పినా కూడా దేనిపై కాన్సన్ ట్రేషన్ చేయలేదు కాబట్టి జనం దూరం పెట్టారు. ఇప్పుడు బాబు 2.ఓలో కేవలం అమరావతినే కాదు, విశాఖపై కూడా దృష్టిపెట్టారు. ఓవైపు అమరావతిని పూర్తి చేస్తూనే, అటు విశాఖను అంతకు మించి అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. అంటే అమరావతి కంటే మిన్నగా చంద్రబాబు విశాఖను ఇష్టపడుతున్నారనుకోవాల్సిందే.
విశాఖ కీలకం..
ఏపీలో అమరావతిని అభివృద్ధి చేయాలంటే చాలా కాలం పడుతుంది. ఈ పాలనా వ్యవధిలో అమరావతిలో అద్భుతాలు చూపించడం కుదరని పని. దాదాపు నిర్మాణాలు పూర్తి చేసి, రోడ్లు వేసి, ఒక నగరంగా అమరావతిని చూపించగలరు కానీ, అక్కడ జన సమ్మర్థం పెంచి, పూర్తి స్థాయిలో రాజధాని అనే కలర్ వేయడానికి మరింత సమయం పడుతుంది. అప్పటి వరకు అమరావతి జపం చేస్తే రాజకీయంగా అది కూటమికి మేలు చేయదు. అందుకే గతంలో జరిగిన తప్పుల్ని రిపీట్ చేయకుండా ఈసారి విశాఖపై ఎక్కువ ఫోకస్ పెట్టారు చంద్రబాబు. పాలనా రాజధాని అని ప్రకటించి కూడా జగన్ చేయలేని పనుల్ని, ఆ పేరులేకుండానే చంద్రబాబు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర వాసుల మనసుల్ని గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి.