Chandrababu, Jagan : ఏపీలో ఎన్నికలకు ఇంకా 14 నెలల మాత్రమే సమయం ఉంది. అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. నియోజకవర్గాలపై వరుస సమీక్షలు చేస్తున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలంగా మార్చేందుకు గృహసారథులను నియమించారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తిరగాలని పదేపదే చెబుతున్నారు. ఈ విషయంలో ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలకు క్లాసులు పీకారు. మరోవైపు పార్టీకి గత ఎన్నికల్లో మద్దతు పలికిన అన్ని వర్గాలను కాపాడుకునే ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు. వైసీపీకి ఎస్సీ, ఎస్టీ, మెనార్టీల మద్దతు ఇప్పటికీ బలంగానే ఉంది. గత ఎన్నికల్లో బీసీలు ఓట్లు కొల్లగొట్టడంలో జగన్ సక్సెస్ అయ్యారు. మరి ఆ ఓటు బ్యాంకును కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఆ దిశగా జగన్ వ్యూహాలకు పదును పెడుతున్నారు. బీసీ నేతలను పార్టీలోకి ఆకర్షిస్తున్నారు. వెనుకబడిన వర్గాల నేతలకు పదవులు ఎక్కువగా ఇస్తున్నారు.
బీసీలపై బాబు ఫోకస్..
టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి బీసీలు వెన్నుదన్నుగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో బీసీ ఓట్లు జారీ పోవడంతోనే టీడీపీ ఘార పరాజయాన్ని చవిచూసింది. అందుకే మళ్లీ బీసీ ఓటుబ్యాంకుపై చంద్రబాబు దృష్టిపెట్టారు. పార్టీపై తిరిగి వెనుకబడిన వర్గాలకు విశ్వాసం కలిగించాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే టీడీపీ బీసీల పార్టీ అని పదేపదే చెబుతున్నారు.
పదవులే పదవులు..
బీసీలపై ఓట్లపై టీడీపీ గురిపెట్టడంతో వైసీపీ అధినేత, సీఎం జగన్ అలెర్ట్ అయ్యారు. తాజాగా కైకలూరు మాజీ ఎమ్మెల్యే , టీడీపీ నేత జయమంగళ వెంకటరమణను వైసీపీలో చేర్చుకున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేశారు. వెంకటరమణ బీసీ కావడం వల్లే ఎమ్మెల్సీ ఇచ్చారని వైసీపీ వర్గాల మాట. మరోవైపు ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 16 స్థానాలు ఖాళీ అవుతున్నాయి.ఇందులో స్థానిక సంస్థల కోటాలో 9 స్థానాలు ఉన్నాయి. మార్చి 29తో ఎమ్మెల్యేల కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి. ఈ 16 స్థానాలకు అభ్యర్థులను ఒకేసారి ప్రకటించే యోచనలో జగన్ ఉన్నారని తెలుస్తోంది. అలాగే జూలై 20తో గవర్నర్ కోటాలో మరో రెండు స్థానాలు ఖాళీ కానున్నాయి. వాటికి కూడా ఇప్పుడే అభ్యర్థులను ఖరారు చేస్తారని సమాచారం. ఎమ్మెల్సీ స్థానాలన్నీ వైసీపీకే దక్కే అవకాశం ఉన్నందుకు ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది.
బీసీలకే ప్రాధాన్యత..
స్థానికసంస్థల కోటాలో కడప జిల్లాకు పి. రామసుబ్బారెడ్డి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు జయమంగళ వెంకటరమణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు కుడుపూడి సూర్యనారాయణ పేర్లు ఖరారయ్యాంటున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరిలో గుణ్ణం నాగబాబు లేదా వంకా రవీంద్రకు ఎమ్మెల్సీ ఇస్తారని టాక్ వినిపిస్తోంది. ఉభయగోదావరి జిల్లాల్లో రెండు ఎమ్మెల్సీలు బీసీలకు, ఒకటి కాపులకు ఇచ్చే యోచనలో జగన్ ఉన్నారు. ఈ జిల్లాలే రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని నిర్ణయిస్తాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరిలో బలమైన శెట్టిబలిజ (బీసీ) వర్గానికి చెందిన కుడుపూడి సూర్యనారాయణకు పశ్చిమగోదావరి నుంచి ఒక కాపు నేతకు ఎమ్మెల్సీ పదవి దక్కే ఛాన్సు ఉంది. శ్రీకాకుళంలో నీలకంఠనాయుడు, నర్తు రామారావుల్లో ఒకరికి ఇస్తారని తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో బెస్త వర్గానికి, అనంతపురం జిల్లాలో బీసీ మహిళకు అవకాశం కల్పిస్తారని అంటున్నారు. చిత్తూరులోనూ బీసీ అభ్యర్థికి అవకాశం ఉంటుందని తెలుస్తోంది. మొత్తంమీద 18 ఎమ్మెల్సీ స్థానాల్లో ఆరేడు స్థానాలకు బీసీలకే ఇస్తారని తెలుస్తోంది. ఈ విధంగా బీసీల ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నాలు జగన్ చేస్తున్నారు. ఆ విధంగా టీడీపీకి చెక్ పెట్టొచ్చని వైసీపీ అధినేత భావిస్తున్నారు.