Auto Driver Sevalo Scheme: కూటమి ప్రభుత్వం సంక్షేమం దిశగా మరో అడుగు వేసింది. ఇప్పటికే పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం.. డ్రైవర్ల సంక్షేమం కోసం ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకానికి శ్రీకారం చుట్టనుంది. సొంత ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు ఆటో డ్రైవర్ సేవలో పథకం రూపొందించింది.
ఈ పథకం కింద అర్హులైన డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేల చొప్పున ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ పథకాన్ని శనివారం సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరుకానున్నారు.
సొంత ఆటో, క్యాబ్ కలిగి వాటిపై ఆధారపడి జీవిస్తున్న వారి కోసం రూపొందించిన ఈ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా 2,90,669 మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు. వీరి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.436 కోట్లను కేటాయించింది. ఈ నిధులను నేరుగా డ్రైవర్ల ఖాతాలో జమ చేయనుంది. గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు కేవలం ఏడాదికి రూ.10 వేలు మాత్రమే ఇచ్చింది. కానీ కూటమి ప్రభుత్వం గత పాలకులకంటే 50 శాతం అదనంగా రూ.15 వేలు ఇస్తోంది.
గత ప్రభుత్వంలో 2,61,516 మందిని అర్హులుగా గుర్తించి రూ.261.51 కోట్లే ఖర్చు చేయగా.. ఈసారి లబ్ధిదారుల సంఖ్య మరో 30 వేలు పెరిగింది. అలాగే డ్రైవర్లకు రూ.175 కోట్లు అదనంగా లబ్ధి చేకూరనుంది. ఈ పథకంలో ఆటో డ్రైవర్లు 2,25,621 మంది, త్రీ వీలర్ ప్యాసింజర్ వాహనాల డ్రైవర్లు 38,576 మంది, మోటార్ క్యాబ్ డ్రైవర్లు 20,072 మంది, మ్యాక్సి క్యాబ్ డ్రైవర్లు 6,400 మంది ఉన్నారు. విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 22,955 మంది డ్రైవర్లకు లబ్ధి కలగనుంది.
ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేలు అనే కార్యక్రమం కూటమి మేనిఫెస్టోలో లేదు. అయితే స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం అమలతో ఆటో డ్రైవర్లకు సాయం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని ప్రారంభిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే రూ.1,000 కోట్లు ఖర్చు చేసి రోడ్ల మరమ్మతులు చేపట్టంది. దీంతో వాహనదారులకు కాస్త ఉపశమనం కలిగింది.
పాతవాహనాలపై గత ప్రభుత్వం భారీగా గ్రీన్ ట్యాక్స్ వేయగా.. కూటమి ప్రభుత్వం రూ.20 వేలు ఉన్న గ్రీన్ ట్యాక్స్ ను రూ.3 వేలకు తగ్గించింది. దీంతో ఆటోలు, క్యాబ్ డ్రైవర్లకు ఉపశమనం లభించింది.
అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఆటో డ్రైవర్ సేవలో పథకం అందేలా చేయాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అర్హత ఉండి కూడా జాబితాలో పేరు లేకుంటే.. వారి సమస్యను పరిష్కరించిన వెంటనే లబ్ధిదారుల జాబితాలో చేర్చేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇందు కోసం ప్రత్యేకంగా ఫిర్యాదులు స్వీకరించేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
వాట్సాప్ ద్వారా ఒక ప్రత్యేక గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ సిస్టమ్‌ను కూడా అందుబాటులో ఉంచారు. లబ్ధిదారులు తప్పనిసరిగా ఏపీలో చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.