Amaravati: రాజధాని అమరావతిలో మలేసియాకు చెందిన ప్రజాప్రతినిధుల బృందం పర్యటించింది. ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణాలు, ప్రాజెక్టులు, అభివృద్ధి ప్రణాళికలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ముఖ్యంగా సీడ్ యాక్సెస్ రహదారి పక్కన.. నిర్మాణంలో ఉన్న సీఆర్డీఏ నూతన కార్యాలయ భవనంను సందర్శించి సమగ్ర సమాచారం సేకరించారు.
మంత్రి నారాయణ వివరణ
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ పరిపాలనా శాఖ మంత్రి పీ. నారాయణ మలేసియా ప్రతినిధులతో సమావేశమై అమరావతి అభివృద్ధి ప్రణాళికలను వివరించారు.
అమరావతిని వచ్చే రెండున్నర సంవత్సరాల్లో.. పూర్తిస్థాయి రాజధానిగా తీర్చిదిద్దడమే లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అమరావతిని ప్రపంచంలో టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా రూపుదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో, సమగ్ర మౌలిక సదుపాయాలతో, పర్యావరణ హితంగా అమరావతిని అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పారు.
సీఆర్డీఏ అధికారుల సమగ్ర వివరణ
సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, అదనపు కమిషనర్ భార్గవ్ తేజ మలేసియా ప్రతినిధులకు.. అమరావతి అభివృద్ధి ప్రణాళికలపై సవివరంగా వివరించారు.
రాజధాని నిర్మాణానికి చేపడుతున్న సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించారు.
భవిష్యత్‌లో నిర్మించబోయే ప్రభుత్వ భవన సముదాయాలు, సిటీ ప్లానింగ్, హౌసింగ్ ప్రాజెక్టులు, హరిత ప్రదేశాలు గురించి తెలియజేశారు.
అమరావతిలో పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడేందుకు.. ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.
పెట్టుబడులపై చర్చ
మంత్రి నారాయణ వెల్లడించిన వివరాల ప్రకారం, మలేసియాకు చెందిన పలు ప్రైవేటు సంస్థలు అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి.
రాబోయే 5 సంవత్సరాల్లో రూ.6 వేల కోట్ల నుండి రూ.10 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టే అవకాశముందని మలేసియా ప్రతినిధులు తెలిపారు.
రియల్ ఎస్టేట్, ఐటి, టూరిజం, ఇండస్ట్రియల్ పార్కులు వంటి పలు రంగాల్లో.. మలేసియా సంస్థలు సహకారం అందించనున్నాయి.
ఈ పెట్టుబడులు అమరావతి అభివృద్ధి వేగవంతం చేయడమే కాకుండా, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతాయని మంత్రి పేర్కొన్నారు.
అంతర్జాతీయ స్థాయి రాజధాని
మంత్రి నారాయణ మాట్లాడుతూ, అమరావతిని ఒక ప్రపంచ స్థాయి స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడం లక్ష్యమని అన్నారు.
ఆధునిక రవాణా సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాల రహదారులు, మెట్రో రైలు, ఆధునిక విద్యాసంస్థలు, వైద్య సదుపాయాలు అమరావతి ప్రత్యేకతగా నిలుస్తాయని చెప్పారు.
పర్యావరణహిత అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ, హరిత క్షేత్రాలు, నదీతీర అభివృద్ధి ప్రాజెక్టులు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
గ్లోబల్ స్థాయి పెట్టుబడులను ఆకర్షించేలా పాలసీలను ప్రభుత్వం రూపొందించిందని వివరించారు.
మలేసియా బృందం స్పందన
అమరావతి పర్యటనలో భాగంగా మలేసియా ప్రతినిధులు.. అభివృద్ధి ప్రణాళికలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
అమరావతి నిర్మాణ ప్రణాళికలు అత్యాధునిక నగరాలకు ఏమాత్రం తీసిపోవు. ఇక్కడ పెట్టుబడులు పెట్టడం మాకు గౌరవంగా ఉంటుంది అని వారు తెలిపారు.
Also Read: దత్తన్న గొప్పతనం ఇదే.. అలయ్ బలయ్‌లో కవిత స్పీచ్
అమరావతిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా రెండు దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని అభిప్రాయపడ్డారు.