CM Chandrababu: తిరుపతిలో నిర్వహించిన భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొని భారతదేశపు ప్రాచీన విజ్ఞానం, సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని వివరించారు. భారతీయతను కాపాడుకుంటూ దేశాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాత్రను ఈ సందర్భంగా సీఎం ప్రశంసించారు.
భారతీయ సంస్కృతి, విజ్ఞాన సంపద గురించి చర్చించేందుకు.. భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ ఒక ఉత్తమ వేదికగా నిలుస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. మన దేశం కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కాకుండా, శాస్త్ర విజ్ఞానం, వైద్యం, గణితం, ఖగోళ శాస్త్రం వంటి అనేక రంగాల్లో ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచిందని ఆయన స్పష్టం చేశారు.
ప్రాచీన కాలంలోనే భారతదేశం విజ్ఞానాన్ని సముపార్జించిన దేశంగా వెలుగొందిందని సీఎం గుర్తుచేశారు. ఎన్నో వేల ఏళ్ల క్రితమే అర్బన్ ప్లానింగ్ అంటే ఏమిటో హరప్పా నాగరికత ప్రపంచానికి చాటి చెప్పిందని అన్నారు. పట్టణ నిర్మాణం, నీటి నిర్వహణ, పారిశుధ్యం వంటి అంశాల్లో హరప్పా నాగరికత అత్యంత అభివృద్ధిని సాధించిందని పేర్కొన్నారు.
అలాగే, 2900 ఏళ్ల క్రితమే భారతదేశంలో యోగాభ్యాసం ప్రారంభమైందని చంద్రబాబు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించామని, నేడు 150కిపైగా దేశాలు యోగాను సాధన చేస్తున్నాయని వివరించారు. ఇది భారతీయ సంప్రదాయాలకు ప్రపంచ స్థాయిలో లభించిన గుర్తింపని ఆయన అభిప్రాయపడ్డారు.
భారతదేశం 2600 ఏళ్ల క్రితమే ఆయుర్వేదం ద్వారా.. వైద్య సేవలు అందించిన దేశమని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రకృతితో అనుసంధానమై జీవన విధానాన్ని అలవర్చుకున్న భారతీయులు.. ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఎంతో ముందున్నారని చెప్పారు.
అంతేకాదు, ప్రాచీన కాలంలోనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తక్షశిల విశ్వవిద్యాలయాన్ని నిర్మించుకున్న ఘనత మన భారతదేశానిదేనని గుర్తుచేశారు. అలాగే 1600 ఏళ్ల క్రితమే నలంద విశ్వవిద్యాలయం ద్వారా ఆధునిక విద్యను అందించిన దేశం మనదేనని అన్నారు. విద్య, విజ్ఞానం విషయంలో భారత్ ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచిందని స్పష్టం చేశారు.
సంఖ్యా వ్యవస్థలో కీలకమైన సున్నాను భారతీయులే కనుగొన్నారని చంద్రబాబు నాయుడు తెలిపారు. గణితశాస్త్రంలో ఈ ఆవిష్కరణ ప్రపంచ చరిత్రనే మార్చిందని అన్నారు. అంతేకాదు, మెదడుకు పదును పెట్టే చదరంగం (చెస్) క్రీడను కూడా భారతీయులే కనిపెట్టారని గుర్తుచేశారు.
వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించిన మహానుభావులు మన భారతదేశానికి చెందిన వారేనని సీఎం పేర్కొన్నారు. ఖగోళ శాస్త్రంలో ఆర్యభట్ట, గణితంలో భాస్కరాచార్య, వైద్యంలో చరక, ధన్వంతరి, ఆర్థిక శాస్త్రంలో కౌటిల్యుడు వంటి మహానుభావులు ప్రపంచానికి అపారమైన జ్ఞానాన్ని అందించారని తెలిపారు. వీరందరూ మనకు స్ఫూర్తినిచ్చేలా చరిత్ర సృష్టించారని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ముఖ్యమైన సందేశం ఇచ్చారు. పిల్లలకు స్పైడర్‌మ్యాన్, ఐరన్‌మ్యాన్ గురించే కాదు.. మన హనుమంతుడి గురించి చెప్పాలి. రాముడు, కృష్ణుడు, శివుడు వంటి మహానుభావుల గురించి తెలియజేయాలి. అదే సమయంలో రాక్షసుల స్వభావం ఎలా ఉంటుందో కూడా పిల్లలకు వివరించాలి అని తెలిపారు.
Also Read: తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ.. మూడు రోజుల పాటు శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్లు రద్దు
అని ఆయన అన్నారు. మన పురాణాలు, ఇతిహాసాలు పిల్లలకు విలువలతో కూడిన జీవన పాఠాలు నేర్పుతాయని, అవే భవిష్యత్తు తరాలకు బలమైన పునాది అవుతాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళనానికి హాజరైన సీఎం చంద్రబాబు గారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ తో కలిసి సమ్మేళనం ప్రారంభించిన సీఎం.#BharatiyaVigyanSammelan#ChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/gLh3ahgjPE
— Telugu Desam Party (@JaiTDP) December 26, 2025