Tirumala Vehicles: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒక కీలకమైన విషయాన్ని స్పష్టం చేసింది. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రైవేటు వాహనాల రాకపోకలపై అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో భక్తులు తీవ్ర అయోమయానికి, ఆందోళనకు గురవుతున్న తరుణంలో టీటీడీ స్పందిస్తూ అసలు నిజాలను వెల్లడించింది.
ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు లేవు
తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాల సంఖ్యపై ఎలాంటి పరిమితులు లేదా ఆంక్షలు విధించలేదని టీటీడీ తేల్చి చెప్పింది. రోజుకు కేవలం 15 వేల వాహనాలను మాత్రమే కొండపైకి అనుమతిస్తారని, ఆ సంఖ్య దాటితే చెక్‌పాయింట్ల వద్దే నిలిపివేస్తారని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం సత్యం లేదని వెల్లడించింది. వాహనాల సంఖ్యను పరిమితం చేసేలా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, భక్తులు ఎప్పటిలాగే తమ సొంత వాహనాల్లో తిరుమలకు చేరుకోవచ్చని స్పష్టం చేసింది.
తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు.. చర్యలు తప్పవు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పుకార్లను, అసత్య ప్రచారాలను భక్తులెవరూ నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. శ్రీవారి సమాచారం కోసం కేవలం అధికారిక వెబ్‌సైట్, టీటీడీ విడుదల చేసే ప్రకటనలను మాత్రమే ప్రమాణంగా తీసుకోవాలని సూచించింది. దేవస్థానం పేరుతో తప్పుడు వార్తలను సృష్టించి ప్రచారం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది.
Also Read: ఢిల్లీ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. భయంతో భవనం పైనుంచి దూకిన జనం!