Chandrababu Naidu: వారణాసిలోని రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ‘వారణాసి-వాద్నగర్ సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమంలో ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. ‘ఆజ్ మే కాశీకే పవిత్ర ధర్తీ పర్ ఖడా హూ..’ అంటూ హిందీలో ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన, సభికుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. ‘ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్, వికసిత్ భారత్’ అనేదే మనందరి సంకల్పమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న పురోగతిని, అంతర్జాతీయంగా భారత్ పొందుతున్న గౌరవాన్ని చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు.
పేదరిక నిర్మూలన – సాంకేతిక విప్లవం
ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని చంద్రబాబు కొనియాడారు. సుమారు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని, 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందుతున్నాయని చెప్పారు. పిఎం కిసాన్ ద్వారా 11 కోట్ల మంది రైతులకు నేరుగా నగదు బదిలీ జరుగుతోందన్నారు. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఎకోసిస్టమ్ ద్వారా యువత ఉద్యోగాలు వెతుక్కునే స్థాయి నుంచి ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగిందని చెప్పారు. ప్రధాని మోదీ ఆలోచనా విధానం, దూరదృష్టి వల్ల దేశంలో సాంకేతికత, రక్షణ రంగం, మహిళా సాధికారత ఎంతో బలోపేతమయ్యాయని గుర్తుచేశారు.
అయోధ్యలో వెంకన్న ఆలయం
దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను సీఎం ప్రశంసించారు. దేశంలో నక్సలిజం, మావోయిజాన్ని సంపూర్ణంగా రూపుమాపారని, ‘ఆపరేషన్ సింధూర్’ ద్వారా భారత్ బలాన్ని ప్రపంచానికి చాటిచెప్పారని కొనియాడారు. ఇందుకోసం శ్రమించిన రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్‌ను అభినందించారు. సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న అయోధ్య రామమందిర నిర్మాణాన్ని మోదీ నిజం చేశారన్నారు. శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంద్రబాబు ఈ సందర్భంగా కోరారు.
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అండ
భారత్‌ను తిరుగులేని శక్తిగా మార్చడానికి బ్రహ్మపుత్ర, గంగ, మహానది, గోదావరి, కావేరి నదుల అనుసంధానం ఎంతో కీలకమని, ఇది కేవలం ప్రధాని మోదీతోనే సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధికి, ముఖ్యంగా అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మద్దతును తెలుగు ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని స్పష్టం చేశారు. దేశంలో సుస్థిరత, పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు పెరగాలంటే మోదీ నాయకత్వం ఎంతో అవసరమని, రాజకీయం కోసం కాకుండా జాతి ప్రయోజనాల కోసమే ఎన్డీఏతో కలిసి నడుస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.
Also Read: దమ్ముంటే సభకు రండి.. సీఎం ప్రశ్నలకు సమాధానం చెప్పండి: అద్దంకి దయాకర్