Big Stories

Manifesto : భవిష్యత్తుకు గ్యారంటీ .. టీడీపీ తొలి విడత మేనిఫెస్టో విడుదల..

TDP Manifesto Latest(AP political news): ఏపీలో ఎన్నికలకు ఇంకా 10 నెలల గడువు ఉండగానే టీడీపీ వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో తొలి విడత మేనిఫెస్టోను ప్రకటించారు. మహిళలు, యువత, రైతులు, వెనుకబడిన వర్గాలకు లబ్ధి చేకూర్చే పథకాలను అందులో పొందుపర్చారు. మహాశక్తి, యువగళం, అన్నదాత, బీసీలకు రక్షణ చట్టం, ఇంటింటికీ మంచినీరు, పూర్‌ టు రిచ్‌ అనే 6 కార్యక్రమాలను రాజమండ్రి శివారులోని వేమగిరిలో నిర్వహించిన మహానాడు బహిరంగ సభ వేదికగా ప్రకటించారు.

- Advertisement -

మహాశక్తి కార్యక్రమం కింద 4 పథకాలను చంద్రబాబు ప్రకటించారు. ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటిస్తూ గతంలో తెచ్చిన చట్టాన్ని రద్దు చేస్తామన్నారు. ఆడబిడ్డ నిధి కింద 18 నుంచి 59 ఏళ్ల వయసు గల మహిళలకు ప్రతి నెలా రూ.1,500 చొప్పున వారి ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ఒక ఇంట్లో ఎంతమంది మహిళలుంటే అందరికీ ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఒక్కొక్కరికి ఏడాదికి మొత్తం రూ.18 వేల చొప్పున అందుతుందన్నారు.

- Advertisement -

తల్లికి వందనం కార్యక్రమం ద్వారా చదువుకుంటున్న పిల్లల తల్లులకు ఏటా రూ.15 వేలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ అందజేస్తామన్నారు. ప్రతి ఇంటికీ ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. మహిళలకు జిల్లాలో ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు.

రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలిచ్చే బాధ్యత తనదని చంద్రబాబు హామీఇచ్చారు. ఉద్యోగాలు వచ్చేవరకు యువతకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు. అన్నదాత పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేల ఆర్థికసాయం చేస్తామన్నారు. అధికారంలోకి రాగానే ఇంటింటికీ మంచినీటి పథకం అమలు చేస్తామన్నారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తామని తెలిపారు. పేదవారిని ధనికులుగా చేయడం కోసం ‘పూర్‌ టు రిచ్‌’ కార్యక్రమం అమలు చేస్తామని చంద్రబాబు హామీఇచ్చారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News