AP Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం శనివారానికి వాయుగుండంగా బలపడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారానికి తుపానుగా బలపడుతుందని పేర్కొంది. దీంతో రానున్న నాలుగు రోజులు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
అల్పపీడనం ప్రభావంతో రేపు(శనివారం) కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
అల్పపీడనం సోమవారానికి తుపానుగా బలపడనుండటంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్, ఈడీ దీపక్, అధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రేపు భారీ వర్షాలు, ఎల్లుండి అతి భారీ వర్షాలు, సోమ, మంగళవారాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
‘తుపాను తీవ్రతను అంచనా వేసి ప్రభావిత జిల్లాలని అలెర్ట్ చేయాలి. ముందస్తు జాగ్రత్త చర్యలు పటిష్టంగా అమలు చేయండి. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి. తుపాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు అధికారులకు, ప్రజలకు తెలియజేయాలి. సహయక చర్యలకు SDRF, NDRF బృందాలు పంపించండి. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం మరింత అలర్ట్ గా ఉండాలి. కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి 24/7 కొనసాగించాలి. విపత్తుల సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రందించాలి’- హోంమంత్రి అనిత
Also Read: Weather News: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం, కాసేపట్లో కుండపోత వాన
శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లో ఉండే వారిని గుర్తించి ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. అవసరమైతే ప్రజలను సహాయక శిబిరాలకు తరలించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఎక్కడిక్కడ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఆహారం అందించాలన్నారు. విరిగిన చెట్లు తొలగించడం , విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ పనులు వెంటనే జరిగేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.