Chenab Bridge Wonders: చీనాబ్ నదిపై నిర్మితమైన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన వెనుక ఓ గొప్ప తెలుగు మహిళ శ్రమ ఉంది. ఆమె పేరే గాలి మాధవీ లత. ప్రకాశం జిల్లా యేడుగుండ్లపాడు గ్రామానికి చెందిన ఈ ఇంజినీర్.. దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే చీనాబ్ వంతెన నిర్మాణానికి తన 17 ఏళ్ల సేవను అర్పించి తెలుగు తల్లికి గర్వకారణంగా నిలిచారు. ఈమె కథ కేవలం ఒక ఇంజినీర్ విజయగాధ కాదు.. దశాబ్దాల త్యాగం, పట్టుదల, శ్రద్ధ, శాస్త్రీయ విజ్ఞానం కలసి అందించిన భారత విజయపతాకం.
ఓ గ్రామం నుంచి గగనతల వంతెన వరకూ..
మాధవీ లత ప్రాథమిక విద్యను యేడుగుండ్లపాడు గ్రామంలోనే పూర్తి చేసారు. చదువులో ప్రతిభ కనబరిచిన ఆమె, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సివిల్ ఇంజినీరింగ్‌ను ఎంపిక చేసారు. ఆ తర్వాత ఆమె ఐఐటీ మద్రాస్ లో పీహెచ్.డి పూర్తిచేసి, ఐఐఎస్సి బెంగళూరు లో రాక్ మెకానిక్స్ నిపుణురాలిగా పనిచేశారు. అక్కడి నుంచే ఆమె ప్రయాణం భారతీయ రైల్వేలో అత్యంత క్లిష్టమైన ప్రాజెక్ట్ – చీనాబ్ వంతెన నిర్మాణ దిశగా ప్రారంభమైంది.
చీనాబ్ వంతెన విశేషాలు.. ప్రపంచం మేం కడతామన్నట్టే!
చీనాబ్ వంతెన అనేది జమ్మూ కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా గుర్తింపు పొందింది. ఈ వంతెన సముద్ర మట్టానికి 359 మీటర్ల ఎత్తులో ఉంది, అంటే ఐఫిల్ టవర్ కంటే కూడా ఎత్తుగా నిలిచింది. మొత్తం పొడవు 1,315 మీటర్లు, ఇందులో ప్రధాన ఆర్చ్ స్పాన్ 467 మీటర్లు విస్తరించింది. గంటకు 260 కిలోమీటర్ల వేగాన్ని భరించగల టెక్నాలజీతో, రిక్టర్ స్కేల్‌పై 8.0 తీవ్రత ఉన్న భూకంపాలను కూడా తట్టుకునేలా నిర్మించబడింది. ఈ వంతెన నిర్మాణానికి 30,000 టన్నుల స్టీల్ వినియోగించబడింది.
తక్కువ ఉష్ణోగ్రతలు, మంచు, గాలులు, కొండ ప్రాంతాల కఠిన భౌగోళికత – అన్ని సవాళ్లను అధిగమించి 2023లో నిర్మాణం పూర్తయింది. భారత దేశ నిర్మాణ సామర్థ్యానికి ఇది ప్రపంచానికి చూపిన చిరస్మరణీయ ప్రదర్శన. ఒకింత వంగిన తీగలా కనిపించే ఈ వంతెన, చైనాలోని బేపాన్ వంతెనను దాటేసి ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా నిలిచింది. ఇది మాధవీ లత వంటి తెలుగు ఇంజినీర్ల బలపాటైన శ్రమ ఫలితమే. ఈ వంతెన నిర్మాణానికి వాతావరణ పరిస్థితులు, కశ్మీర్ లోయ భౌగోళిక అడ్డంకులు, రాళ్ల తలాలు, భూకంప ముప్పు – అన్నీ పెద్ద సవాళ్లే.
ప్రపంచం మెచ్చిన ప్రకాశం మహిళ
ఈ వంతెన భద్రత కోసం జియోటెక్నికల్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్న మాధవీ లత పని చాలా కీలకం. ఆమె సూచనల ఆధారంగా వంతెన ఫౌండేషన్ ను రాక్స్ మీదకు భద్రంగా పునాది వేసారు. వర్షాలు, మైనస్ డిగ్రీల చలి, మంచు, గాలులు – ఇలా ఎన్ని ఇబ్బందులు ఉన్నా మాధవీ లత వెనక్కి తగ్గలేదు. ఏడాదికి 250 రోజులు కశ్మీర్ లోనే ఉండి భూగర్భ పరీక్షలు, శిలా పరిమాణాలు, పిలర్స్ డిజైన్, ఆర్చ్ నిర్మాణం మొదలైన ప్రతిదానిపై ఆమె నిత్యం పరిశీలన కొనసాగించారు.
17 ఏళ్ల పతాకం.. ప్రపంచం మెచ్చింది
2005లో మొదలైన ఈ ప్రాజెక్టు 2023లో పూర్తి అయింది. ఈ 17 సంవత్సరాలలో, ఎన్నో ప్రభుత్వాలు మారినా, పని బాధ్యతలన్నీ మాధవీ లత పర్యవేక్షణలోనే సాగాయి.
2024లో ప్రధాని నరేంద్ర మోదీ చీనాబ్ వంతెనను జాతికి అంకితమిస్తూ, భారత నిర్మాణ సామర్థ్యానికి ఇది ఓ గొప్ప ఉదాహరణ అన్నారు. కానీ ఆ నిర్మాణంలో గాలి మాధవీ లత పాత్రను మర్చిపోలేరు.
Also Read: Visakha Metro: విశాఖ మెట్రో సరికొత్త రికార్డు.. తెలుసుకుంటే కాలర్ ఎగరేస్తారు!
తెలుగు అమ్మాయి కీర్తి ప్రపంచానికి వినిపించింది
వారసత్వంగా వచ్చిన ధైర్యం, విద్య ద్వారా వచ్చిన శాస్త్ర విజ్ఞానం, దేశం పట్ల ఉన్న నిబద్ధత, ఇవన్నీ కలిసి మాధవీ లతను దేశానికే గర్వకారణంగా నిలిపాయి. ఆమె మౌనంగా తలవంచి పని చేస్తూ, ప్రతీ రాయికి జీవం పోశారు. ఆమె అంకితభావం కారణంగా తెలుగు ప్రజలు ఇప్పుడు ప్రపంచానికి మనదీ కాదు అనిపించేదే లేదంటూ నిరూపిస్తున్నారు.
ఓ మహిళ.. లక్షల మందికి స్ఫూర్తి
ఇతరులా మైక్ ముందుకు వచ్చి ప్రసంగాలు ఇవ్వకపోయినా, ఆమె జీవితం ఒక పాఠశాల, ప్రతి యువతికి ప్రేరణ. తల్లిదండ్రులు మాధవీ లత కథను తమ పిల్లలతో పంచుకోవాలి. ఎందుకంటే ఈ కథలో ఒక సామాన్య గ్రామ యువతి, అంతర్జాతీయ ఇంజినీరింగ్ ఘనతను ఎలా సాధించిందో తెలుసుకునే విద్య ఉంది. మాధవీలత.. మీ 17 ఏళ్ల ప్రయాణం, చీనాబ్ వంతెనతో పాటు మన తెలుగు జాతికీ శాశ్వతంగా నిలిచిపోయింది. మీరు చూపించిన మార్గం, తెలుగు తల్లికి పరాకాష్ట గౌరవాన్ని తెచ్చింది. ఈ విజయం కేవలం ఇంజినీరింగ్ ప్రాజెక్టే కాదు.. తెలుగు స్ఫూర్తికి నిలువెత్తు జెండాగా సోషల్ మీడియా కోడై కూస్తోంది!