AP Politics : లిక్కర్ స్కాం కేసు ఏపీ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది. ఇన్నాళ్లూ రాజ్ కేసిరెడ్డి, ధనుంజయరెడ్డి లాంటి వాళ్ల చుట్టూనే కేసు తిరిగింది. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అరెస్టుతో రాజకీయ కలకలం మొదలైంది. మనదాకా వచ్చాక చూద్దాంలే అనుకున్నారేమో.. సైలెంట్‌గా ఉన్న నేతలంతా చటుక్కున విదేశాలకు చెక్కేసే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ముందు కొలంబో.. ఆ తర్వాత అట్నుంచి అటే! కానీ, ఏపీ పోలీసులు చాలా షార్ప్‌గా పని చేశారు. ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఊహించారు. ఎందుకైనా మంచిదని లుక్‌అవుట్ నోటీసులు జారీ చేసి పెట్టారు. ఆ విషయం తెలీని చెవిరెడ్డి.. శ్రీలంకకు వెళ్దామని ఎంచక్కా బెంగళూరు ఎయిర్‌పోర్టుకు రావడంతో.. ఎరక్కపోయి ఇరుక్కున్నారు. విమానాశ్రయం సిబ్బంది భాస్కర్‌రెడ్డిని అడ్డుకున్నారు. బెజవాడ పోలీసులు బెంగళూరు వెళ్లి చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు. విజయవాడ సిట్ కార్యాలయానికి ఆయన్ను తరలించారు. చెవిరెడ్డితో పాటు.. వెంకటేష్ నాయుడుని కూడా తీసుకొచ్చారు. వీరిద్దరిని విచారించిన అనంతరం.. ఏసీబీ కోర్టులో హాజరుపరుచనున్నారు. ఇప్పటికే వాళ్లను ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితులుగా చేర్చింది సిట్.
చెవిరెడ్డి ఆడియో మెసేజ్
అయితే.. తన తప్పేమీ లేదంటూ.. అంతా తప్పుడు కేసులంటూ.. ఓ ఆడియోను రిలీజ్ చేశారు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి. జగనన్న వెనక ఉన్న వాళ్లని జైలుకి పంపాలని చూస్తున్నారన్నారని ఆరోపించారు. బెదిరింపులకు ఏమాత్రం భయపడమని.. జగనన్న సైనికులంటే అన్నింటికీ ఎదుర్కొని నిలబడతారని చెప్పారు. ఎన్నైనా, ఏ కేసులైనా పెట్టుకోండి.. ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారాయన.
కేసులు పెట్టి కొట్టారు..
పలువురు వైసీపీ నేతలపై కేసులు పెట్టించారు, కొట్టించారన్నారు చెవిరెడ్డి. ఏ సంబంధం లేని తనపై ఏడాది కాలంగా రకరకాల కేసులు పెట్టి తీసుకెళ్లాలని చూస్తున్నారని చెప్పారు. పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేయాలని.. నియామకాలు ఆపవద్దని తెలిపారాయన.
Also Read : పోలీసుల అదుపులో కొడాలి నాని
ఆ గన్‌మెన్ సంగతేంటి?
మరోవైపు, చెవిరెడ్డి మాజీ గన్‌మాన్ మదన్‌రెడ్డి లేఖపై సిట్ సీరియస్‌గా ఉంది. ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. మదన్‌రెడ్డిని మరోసారి అదుపులోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. గత ఐదేళ్లలో మదన్ రెండు ఇళ్లు నిర్మించాడని ఆరోపణలు ఉన్నాయి. ఏకంగా 10 ఏళ్ల పాటు చెవిరెడ్డికి గన్‌మెన్‌గా మదన్ ఎలా ఉన్నారన్న దానిపై శాఖాపరమైన అంతర్గత విచారణ చేస్తున్నారు ఉన్నతాదికారులు.