Kodali Nani: ఏపీలో కూటమి సర్కార్ దూకుడు పెంచింది. తమపై కేసుల పరిస్థితి తెలుసుకున్న నేతలు సీక్రెట్‌గా విదేశాలకు చెక్కేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బెంగుళూరు ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఇప్పుడు మాజీ మంత్రి కొడాలినాని వంతైంది. ఆయనను కలకత్తా ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకుని ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వైసీపీ అధినేత జగన్ కోర్ టీమ్‌కు కష్టాలు రెట్టింపు అయ్యాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వల్లభనేని వంశీ, పేర్నినాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కొడాలినాని ఇలా చూసుకుంటూ పోతే పెద్ద లిస్టు ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరంతా వేర్వేరు కేసుల్లో ఇరుక్కున్నవారే.
తమ నియోజకవర్గాల్లో ఉండకుండా పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నారు. మరికొందరైతే అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నవారు ఉన్నారు. ఇంకొందరు అదే ప్రయత్నంలో ఉన్నారు.
మద్యం కుంభకోణం కేసులో సీక్రెట్ విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని మంగళవారం బెంగుళూరు ఎయిర్‌పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. వెంటనే ఏపీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గతరాత్రి ఆయనను అరెస్టు చేసి విజయవాడకు తరలించారు.
ALSO READ: తూర్పుగోదావరి అడవుల్లో ఎదురుకాల్పులు, కీలక నేతలు హతం
తాజాగా వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి నాని వంతైంది. ఆరోగ్యం పేరిట కొన్నాళ్లుగా దూరంగా ఉన్న ఆయన, ఇటీవల మీడియా ముందు కనిపించారు. వెంటనే అలర్టయిన ఏపీ పోలీసులు, కొడాలినాని విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ నోటీసులు ఇచ్చారు.
ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం కలకత్తా ఎయిర్‌పోర్టులో కొడాలి నానిని ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోల్‌కతా నుంచి కొలంబోకు ఆయన పయనమైనట్టు వార్తలు వస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల ఎయిర్‌పోర్టుల నుంచి విదేశాలకు వెళ్తే ఇబ్బందులు వస్తాయని భావించిన ఆయన, నేరుగా కోల్‌కత్తాను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
కొడాలి నానిపై విజయవాడ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. వాటిలో ఒకటి వాలంటీర్ల చేత బలవంతపు రాజీనామాలు, మరొకటి లిక్కర్ గోదాంపై దాడి వంటివి ఉన్నాయి. ఆ కేసుల విచారణకు కొడాలి అనుచరులు హారయ్యారు. కొడాలి మాత్రం తప్పించుకుంటున్నారు.
వైపీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన, హైదరాబాద్, ముంబై, చెన్నై ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. మరోవైపు కొడాలి నాని అరెస్టుపై వస్తున్న వార్తలు నిరాధారమంటున్నారు ఏపీ పోలీసులు. కోల్‌కతాలో ఆయన్ని అరెస్టు చేశారన్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని చెబుతున్నాయి పోలీసు వర్గాలు.