Amaravati News: కారణాలు ఏమైనా కావచ్చు కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారా? అసెంబ్లీ సమావేశాల్లో కావాలనే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారా? ఇకపై వారి నోటికి కళ్లెం వేయాల్సిందేనా? కేబినెట్ భేటీ తర్వాత సీఎం చంద్రబాబు మంత్రులకు ఏం చెప్పారు? నోరు జారిన ఎమ్మెల్యేలకు తాళం వేయాల్సిందేనని ఎందుకన్నారు? ఇవే ప్రశ్నలు చాలామంది ఎమ్మెల్యేలను వెంటాడుతున్నాయి.
బాబు క్లాస్ వెనుక, ఇక వారికి నోళ్లకు తాళం
శుక్రవారం కేబినెట్ భేటీ తర్వాత సీఎం చంద్రబాబు మంత్రులతో కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో కొందరు ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా మాట్లాడారు. ఒకానొక దశలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేస్థాయికి వెళ్లారు. వెంటనే వాళ్లని పిలిపించుకుని మరీ క్లాస్ పీకారు. కేబినెట్ భేటీ తర్వాత కూడా ఇదే విషయంపై రియాక్ట్ అయ్యారు సీఎం చంద్రబాబు.
ఇష్టానుసారంగా మాట్లాడే సభ్యులను నియంత్రించాల్సిన బాధ్యత జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులదేని తేల్చిచెప్పారు. ఇన్‌ఛార్జి మంత్రులకు-శాసనసభ్యులకు మధ్య సమన్వయం ఉండాల్సిందేనన్నారు. అది ఎక్కడో మిస్సవుతుందన్నారు. ఆ విషయాన్ని చాలామంది మంత్రులు మర్చిపోయినట్లు ఉన్నారంటూ క్లాస్ తీసుకున్నారు.
ఇన్‌ఛార్జుల మంత్రులదే బాధ్యత
జిల్లాల్లో పాలనా వ్యవహారాలు చూడటానికి ఇన్‌ఛార్జి మంత్రులు అవసరం లేదన్నారు. అందుకు కలెక్టర్లు ఉన్నారని అన్నారట. ఎమ్మెల్యేలతో సమన్వయం, పొలిటికల్ మేనేజ్‌మెంట్, కూటమి పార్టీల మధ్య సమన్వయం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని అన్నారు. ఇన్‌ఛార్జి మంత్రులకు జిల్లాలో ఎమ్మెల్యేలపై నియంత్రణ లేకపోతే ఎలాని ప్రశ్నించారు.
ALSO READ: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు
అసెంబ్లీ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేలు తెలిసో తెలియకో పరిధులు దాటి ఉండవచ్చని, అలా జరగకుండా చూడాల్సింది ఇన్‌ఛార్జి మంత్రులేనన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఫ్లోర్ మేనేజ్‌మెంట్ చాలా ముఖ్యమని, ఆ బాధ్యత ఇన్‌ఛార్జి మంత్రులు తీసుకోవాలన్నది సీఎం మాట. మంత్రులు వారి వారి శాఖలకు సంబంధించి విపక్షాల నుంచి ఎలాంటి విమర్శలు రాకుండా చూసుకోవాలన్నారు.
ఒకవేళ వస్తే వెంటనే వెంటనే కౌంటర్ ఇచ్చేదిగా ఉండాలన్నారు. మంత్రులు తాము ఇన్‌ఛార్జులుగా ఉన్న జిల్లాలకు ఆటో డ్రైవర్లకు ఆర్థికసాయం పంపిణీ కార్యక్రమానికి హాజరుకావాలన్నారు. కేబినెట్ సమావేశానికి నలుగురు మంత్రులు రాలేదు. వారిలో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ జ్వరంతో బాధపడుతుండడంతో రాలేదు.
మరో ఇద్దరు టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్ విదేశీ పర్యటనలో ఉన్న విషయం తెల్సిందే. సీఎం చంద్రబాబు.. మంత్రులకు క్లాస్ తీసుకున్న విషయం తెలియగానే కొందరు ఎమ్మెల్యేలు రకరకాలుగా ఆఫ్ ద రికార్డులో చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఓవరాల్‌గా పరిశీలిస్తే ఇన్ ఛార్జ్ మంత్రులకు సీఎం చంద్రబాబు ఫుల్ రైట్స్ ఇచ్చినట్టు కనిపిస్తోంది.