CM Chandrababu: ఏపీ రాజధాని ఏంటీ.. నిన్న మొన్నటి వరకు ఈ ప్రశ్నకు సమాధానం లేదు. దానికి కారణం గతంలో అధికారంలో ఉన్న వైసీపీ మూడు రాజధానులు అని ప్రకటించి ఒక్క రాజధానిని కూడా నిర్మించలేదు. కానీ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ రాజధాని అమరావతి అని అంటున్నారు. మరి.. మళ్లీ అధికారం చేతులు మారితే పరిస్థితి ఏంటీ? రాజధానిగా అమరావతి ఉంటుందా? లేకపోతే మళ్లీ మూడు రాజధానులు అంటారా? ఇది ప్రతీ ఒక్కరిలో మెదులుతున్న ప్రశ్న. దీనికి శాశ్వత పరిష్కారంపై సీఎం దృష్టి పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నోటిఫై చేస్తూ విభజన చట్టాన్ని సవరణ చేయడానికి ఆలోచన చేస్తున్నారు. దీనికి ఉన్న అవకాశాలు పరిశీలస్తున్నామని అన్నారాయన.
అమరావతినికి చట్టబద్ధం కల్పించే ప్రయత్నం చేద్దామని హామీ
రాజధాని రైతులు, మహిళలతో నిన్న ప్రత్యేకంగా సమావేశమయ్యారు చంద్రబాబు. రాజధాని పనుల పునఃప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజధాని రైతులంతా కుటుంబసభ్యులతో రావాలని సీఎం ఆహ్వానించారు. ఆటైంలో శాశ్వత రాజధానిగా అమరావతి ఉండేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళతానని రాజధాని రైతులకు ఆయన హామీ ఇచ్చారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్న సమయంలో ఇది సాధ్యం కాలేదని.. ఇప్పుడు ఆగడువు ముగిసింది కాబట్టి.. చట్ట సవరణ ద్వారా రాజధానికి రక్షణ కల్పిస్తామని సీఎం అన్నారు.
రాజధాని అభివృద్ధికి రెండో విడదత భూసేకరణ తప్పనిసరి
రాజధాని అభివృద్ధికి రెండో విడదత భూసేకరణ తప్పనిసరి అని చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం వస్తేనే డెవలప్ అవుతుందన్నారు. లేకపోతే మున్సిపాలిటీగానే మిగిలిపోతుందన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయానికి ఏకగ్రీవంగా అంగీకరిస్తామన్నారు అమరావతి రైతులు. అయితే అమరావతిని ఏకైక రాజధానిగా పార్లమెంట్లో చట్టం చేయాలన్నారు రైతులు. 11 గ్రామాల్లో దాదాపు 40 వేల వరకు భూ సేకరణ జరగాల్సి ఉంది. ఔటర్ రింగ్ రోడ్, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుతో పాటు మిగిలిన వాటికోసం భూసేకరణ చేయాల్సిందే. చాలా గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధంగా ఉన్నారు.
విభజన చట్టం సవరణ చేసేందుకు ప్రయత్నిస్తామన్న సీఎం
భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందీ లేకుండా.. ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతిని కేంద్ర ప్రభుత్వం ప్రకటించేలా చేయాలని రైతులు కోరారు. ఎన్డీయేలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉన్నందున చంద్రబాబు చెబితే ప్రధాని మోదీ వింటారని రైతులు ఆశ. అయితే.. అది మన పరిధిలోని అంశం కాదని.. మనం డిమాండ్ చేయకూడదని సీఎం వారికి చెప్పారు. ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని అన్నారు.
దానికి ఉన్న అవకాశాలు పరిశీలిస్తామని రైతులకు హామీ
రైతుల త్యాగం వల్లే అంతర్జాతీయ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మించుకుంటున్నామని.. వారి మంచి మనసును రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకుంటారని సీఎం కొనియాడారు. రైతులు, మహిళలతో ఆయన ముచ్చటించి.. వారికి ఉన్న అనుమానాలు క్లియర్ చేశారు. రైతులకిచ్చిన రిటర్నబుల్ ప్లాట్లకు బ్యాంకులు రుణాలివ్వడం లేదని పలువురు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను త్వరగా క్లియర్ చేస్తానని హామీ ఇచ్చారు సీఎం. రుణాలిప్పించేలా బ్యాంకులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.
విశాఖకు త్వరలోనే గూగుల్ కంపెనీ
మరోవైపు.. విశాఖకు త్వరలోనే గూగుల్ కంపెనీ వస్తుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. విశాఖకు గూగుల్ వస్తే.. నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా ఏపీ మారుతుందని ఆయన అన్నారు. స్టార్టప్ కంపెనీల కోసం అమరావతిలో వి- లాంచ్ పాడ్ 2025ను చంద్రబాబు నిన్న ఆవిష్కరించారు. అక్కడ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో 14 నెలల్లోనే హైటెక్ సిటీ పూర్తి చేశామని గుర్తు చేసిన సీఎం.. అప్పట్లో ఐటీని ప్రోత్సహిస్తే, ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నామని అన్నారు. ఒకప్పుడు గవర్నమెంట్ అటెండర్ పోస్టుకు కూడా డిమాండ్ ఉండేదన్న చంద్రబాబు.. ఇప్పుడు కలెక్టర్ పోస్టు కంటే ఐటీ ఉద్యోగాలకే ఎక్కువ డిమాండ్ ఉందని అభిప్రాయపడ్డారు.
Also Read: మన స్వర్ణాంధ్రకు గూగుల్.. ఎక్కడంటే..? సీఎం చంద్రబాబు బిగ్ గుడ్ న్యూస్..
2024 డిసెంబరులోనే విశాఖలో గూగుల్ డేటా సెంటర్
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కోసం ఇప్పటికే అధికారులు భూమిని కూడా సిద్ధం చేశారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో 250 ఎకరాలు గుర్తించారు. ఈ ప్రదేశం ఆనందపురం మండలానికి మూడు కిలోమీటర్లు, జాతీయ రహదారికి ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉంటుంది. దీంతో తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం 2024 డిసెంబరులోనే గూగుల్ ఏపీ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. దీనిపై త్వరలోనే ఓ ప్రకటన వస్తుందని అన్నారాయన.