Statue of Sacrifice: అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్‌లో వైభవంగా జరిగాయి. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన ఆయన స్మృత్యర్థం అమరావతిలోని శాఖమూరులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఆవిష్కరించారు. ఈ విగ్రహానికి ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ (త్యాగమూర్తి విగ్రహం) అని నామకరణం చేశారు. ఈ చారిత్రక ఘట్టంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా పలువురు మంత్రులు కూటమి నాయకులు పాల్గొన్నారు.
తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం సాధించడం కోసం పొట్టి శ్రీరాములు చేసిన 58 రోజుల నిరాహార దీక్షకు గుర్తుగా ఈ విగ్రహాన్ని 58 అడుగుల ఎత్తులో నిర్మించారు. సుమారు రూ.150 కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ విగ్రహం తయారీలో 30 టన్నుల కంచు 70 టన్నుల ఇనుప గడ్డర్లను ఉపయోగించారు. కృష్ణా జిల్లా బొమ్ములూరుకు చెందిన శిల్పులు దీనిని అత్యంత కళాత్మకంగా తీర్చిదిద్దారు. ఎక్స్ వేదికగా నివాళులర్పించిన చంద్రబాబు పొట్టి శ్రీరాములు త్యాగం తరతరాలకు స్ఫూర్తినిస్తుందని కొనియాడారు. గాంధీజీ అడుగుజాడల్లో నడిచి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఆయన జీవితం మనందరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. అమరజీవి త్యాగనిరతిని స్మరించుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా ఘన నివాళులర్పించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పునాది వేసిన వ్యక్తిగా చరిత్రలో ఆయన పేరు సుస్థిరమని కొనియాడారు.
ఆంధ్రరాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకుంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ పథకానికి ఇకపై ‘అమరజీవి జలధార’ అని పేరు పెడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించే ఈ పథకం ద్వారా ప్రజలు నీరు తాగే ప్రతిసారీ పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తు చేసుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
విగ్రహ ఆవిష్కరణ అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగానికి మానవరూపమే ఈ విగ్రహమని ప్రశంసించారు. ఆంధ్ర రాష్ట్ర రూపంలో ఆయన నిరంతరం జీవించే ఉంటారని చెప్పారు. ఆత్మార్పణ చేసిన ఆ మహనీయుడి పోరాటం స్వార్థం లేనిదని కితాబిచ్చారు. నెల్లూరులో దళితులకు ఆలయ ప్రవేశం కల్పించడం కోసం ఆయన చేసిన సామాజిక పోరాటాలను లోకేశ్ గుర్తు చేశారు. ఆర్యవైశ్యులకు ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే పొట్టి శ్రీరాములు పేరుపై ప్రత్యేక నాణేన్ని (కాయిన్) విడుదల చేస్తామని ప్రకటించారు. అమరావతిలో కొలువుదీరిన ఈ విగ్రహం తెలుగువారి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also: LPG Statistics: దేశంలో గ్యాస్ సంక్షోభం.. LPG గురించి.. ఆశ్చర్యపరిచే వాస్తవాలు!