
Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటిస్తారు. అక్కడ నిర్వహించే కార్యక్రమంలో జగనన్న విద్యా దీవెన పథకం కింద జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించిన నిధులు రూ.703 కోట్లు విడుదల చేస్తారు. బటన్ నొక్కి నేరుగా 9.95 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బును జమ చేస్తారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది.
ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సులు చదివే విద్యార్థులు కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తోంది. విడతల వారీగా ఈ మొత్తాన్ని అందిస్తోంది. మూడునెలలకోసారి. కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి వారి తల్లుల ఖాతాల్లో నేరుగా డబ్బులను సీఎం జగన్ జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు 26,98,728 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.10,636.67 కోట్లు జమ చేశామని ప్రభుత్వం వెల్లడించింది.
సీఎం జగన్ కొవ్వూరు పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కేజీఎం పాఠశాల సమీపంలో హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణానికి రెండు కిలోమీటర్ల పరిధిలో అనేక చోట్ల చెట్ల కొమ్మలను తొలగించారు.