Weather Update: తెలంగాణలో గత కొద్ది రోజులుగా భీకరమైన చలి పంజా విసురుతోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి చంపేస్తోంది. ఉదయం, రాత్రిపూట అనే తేడా లేకుండా, ఒళ్ళు గడ్డకట్టుకుపోయేంత చలిగాలులు వీస్తున్నాయి. చాలా జిల్లాల్లో అయితే, ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయి, అసలు బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఈ చలి తీవ్రతతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. పొద్దున ఇంటి పనులు చేసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో చలి నుంచి ఉపశమనం పొందేందుకు మంటలు వేసుకుంటున్నారు. ఇక చలితో వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడుతున్నారు.
కనిష్ఠ స్థాయికి పడిపోతున్న ఉష్ణోగ్రతలు
ఈ చలి గాలుల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కే పడిపోతున్న కారణంగా.. వాతావరణ శాఖవారు (IMD) పలు జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేశారు. ముఖ్యంగా అటు ఆదిలాబాద్, సంగారెడ్డిలో, కొమురం భీం, ములుగు, మంచిర్యాల, వరంగల్, హనుమకొండ, మెదక్, కామారెడ్డి, హైదరాబాద్ వంటి జిల్లాల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదై, ప్రజలను పరేషాన్ చేస్తున్నాయి.
పొగమంచుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారుల
అలాగే ఈ మధ్యకాలంలో తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉదయం తొమ్మిది దాటినా సరే, రోడ్లమీద ఏం కనిపించనంత పొగమంచు ఉంటుంది. దానివల్ల డ్రైవింగ్ చేసేవారు, ముఖ్యంగా రైతులు పొలాలకి వెళ్లేవారు చాలా కష్టపడుతున్నారు. అయితే చలిగాలులు ఇంకో రెండు రోజుల వరకు కూడా ఇలాగే ఉండే అవకాశం ఉందని, సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగ ఉష్ణోగ్రతలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు.
ఏపీలో దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. వణుకుతున్న జనం
ఇక ఏపీలో కూడా చలి తీవ్రత ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా పలు జిల్లాలో 5 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఎక్కువగా అల్లూరి సీతారామరాజు, మన్యం, ముంచంగిపుట్టులో, దుబ్రిగూడలో, అరకులో, చింతపల్లి, వంజంగి, పాడేరు, లంబసింగి వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి.
Also Read: తీవ్ర విషాదం.. స్కూల్ ID కార్డ్ ట్యాగ్‌తో ఉరి వేసుకుని 4వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..
చలి మంటలతో సేద తీరుతున్న జనం.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వృద్దుల, చిన్నపిల్లలు
కావున, ఈ చలిగాలుల ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దంటున్నారు. ముఖ్యంగా చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వేడి వేడి ఆహారం, వేడి పానీయాలు తీసుకుంటూ, వెచ్చని దుస్తులు కప్పుకుని చలి నుంచి బయటపడాలి. అలాగే, ఎండ వచ్చినప్పుడు మాత్రం కాస్తంత ఉపశమనం కోసం బయటకు రావచ్చు. అంతేకాకుండా అనవసరంగా బయటికి తిరగకుండా, అధికారులు చెప్పినట్టు జాగ్రత్తలు పాటిస్తే మంచిది.