AC explosion: హైదరాబాద్ లోని బాచుపల్లి ప్రాంతంలో మంగళవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో ఏసీ అకస్మాత్తుగా పేలిపోవడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో జ్యోతి అనే మహిళ తీవ్రంగా గాయపడగా, ఆమెను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
పేలుడు ఘటన వివరాలు
సాక్షుల కథనం ప్రకారం.. ఉదయం సుమారు 8 గంటల సమయంలో.. జ్యోతి తన గదిలోని ఏసీ ఆన్ చేసి గృహపనులు చేసుకుంటుండగా, అకస్మాత్తుగా శబ్దం వినిపించింది. కొన్నిసెకన్లలోనే ఏసీ యూనిట్ నుంచి మంటలు ఎగసి పడి పేలుడు సంభవించింది. ఇంటి గోడలు, ఫర్నిచర్, సీలింగ్ ఫ్యాన్ తీవ్రంగా దెబ్బతిన్నాయి.
షార్ట్ సర్క్యూటే కారణమా?
మొదట్లో ఏసీ యూనిట్‌లో గ్యాస్ లీకేజీ కారణంగా.. పేలుడు జరిగిందని భావించినా, అనంతరం అధికారులు చేసిన ప్రాథమిక పరిశీలనలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తేల్చారు. హైడ్రా (Hydra) టెక్నికల్ టీమ్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, వైరింగ్‌లో సాంకేతిక లోపం ఉన్నట్లు గుర్తించారు.
మంటలను అదుపుచేసిన అగ్నిమాపక సిబ్బంది
ఫైర్ సర్వీస్ బృందం తక్షణమే ఘటనాస్థలికి చేరుకుని.. మంటలను అదుపు చేశారు. సమీప గృహాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. మంటల ధాటికి ఇంటిలోని ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫర్నిచర్ దగ్ధమయ్యాయి.
Also Read: నల్గొండలో ఇంటర్ విద్యార్ధిని దారుణ హత్య
హైడ్రా బృందం పరిశీలన
హైడ్రా బృందం సాంకేతిక దర్యాప్తులో భాగంగా.. ఏసీ భాగాలను, వైరింగ్ నమూనాలను స్వాధీనం చేసుకుంది. మోటార్ బర్నింగ్, లేదా ఫ్యూజ్ లీక్ కారణమైందా అనే దానిపై ల్యాబ్ పరీక్షలు నిర్వహించనున్నారు.