Nandi Awards: ఏపీ చిత్రపరిశ్రమ నిట్టనిలువునా చీలిపోయిందా..? అధికార పక్షానికి అనుకూలంగా కొందరు.. వ్యతిరేకంగా మరికొందరు చేసిన వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి..? ఉత్తమ గూండాలు, బెస్ట్ విలన్లు అనే పేర్లపై నంది అవార్డులు ఇవ్వాలంటూ నిర్మాత అశ్వనీదత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక.. ఇప్పటివరకు నందీ అవార్డులు ప్రదానోత్సవం జరగలేదు. అందుకు కారణాలేవైనా.. దాని చుట్టూ వివాదాలు మాత్రం ఆగడం లేదు. సినీ పరిశ్రమకు చెందిన కొందరు పెద్ద తలకాయలు.. ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో.. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఈ ప్రభుత్వంలో ఉత్తమ గూండాలు, ఉత్తమ విలన్ల పేర్లపై అవార్డులు ఇస్తున్నారని.. ఎద్దేవా చేశారు. రెండు మూడేళ్లు ఆగితే అందరికీ అవార్డులు వస్తాయని చెప్పుకొచ్చారు. మరోవైపు అవార్డులన్నీ రాజకీయం అయ్యాయని.. అనుకూలంగా ఉన్నవారికే ఇస్తున్నారని.. సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు అన్నారు.
అయితే అశ్వనీదత్ కామెంట్లపై ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళీ తీవ్రంగా స్పందించారు. ఉత్తమ రౌడీ, ఉత్తమ గూండా కాదని.. ఉత్తమ వెన్నుపోటుదారుడు, ఉత్తమ లోఫర్, మోసగాడు అంటూ అవార్డులు ఇవ్వాలని కౌంటర్ ఎటాక్ చేశారు. అశ్వనీదత్ గురించి అందరికీ తెలుసని.. నీతి నిజాయితీపై అతడే మాట్లాడాలని ఎద్దేవా చేశారు.
మరోవైపు రజినీకాంత్ వ్యాఖ్యలపై కూడా పోసాని రెస్పాండ్ అయ్యారు. చంద్రబాబు రజినీకాంత్ ఎంతలా పొగిడినా.. తమకేం నష్టం లేదన్నారు. రజినీ సూపర్ స్టార్ కారని.. తమకు సూపర్ స్టార్ చిరంజీవి అంటూ పోసాని చెప్పుకొచ్చారు.