TN Rains Effect AP: ఏపీకి తమిళనాడు వరదల ఎఫెక్ట్ ఉండనుందా.. ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా వరదలు పోటెత్తుతున్నాయి. అయితే ఏపీకి కూడా వరదల ఎఫెక్ట్ ఉందనుందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించగా, దీని ఎఫెక్ట్ రేపటి నుండి ఉండనుందని ఏపీ ప్రకృతి విపత్తుల సంస్థ కూడ ప్రకటించింది.
ఐఎండి సూచనల ప్రకారం నైరుతి బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం ఉత్తర-వాయువ్య దిశగా కదులుతున్న నేపథ్యంలో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కడలూరు, మైలాడుదురై, తిరువారూర్‌లో కుండపోత వర్షాలు కురుస్తుండగా, వీధులు, వాగులు, వంకలు జలకళను సంతరించుకున్నాయి. ఈ వరదల ధాటికి చెన్నై సహా 9 జిల్లాల్లో విద్యాసంస్థలకు ఇప్పటికే ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దీనిని బట్టి తమిళనాట వరదల ఎఫెక్ట్ ఏమేరకు ఉందో చెప్పవచ్చు.
అలాగే నాగపట్నం జిల్లాలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. కాగా మరో 48 గంటల పాటు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం తమిళనాడు రాష్ట్రంలో ఉండగా, అక్కడి ప్రభుత్వం అప్రమత్తమై ఇప్పటికే వరద సాయాన్ని కూడా ముమ్మరం చేసింది. ఎక్కడికక్కడ అధికారులను నియమించి, వరద సహాయక చర్యల్లో ఎటువంటి ఆలస్యం లేకుండా ముందుగానే అప్రమత్తమైంది. ఈ వరదల ఎఫెక్ట్ తో చెన్నైతో పాటు 12 తీరప్రాంత జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. అలాగే పుదుచ్చేరిలోని కారైకాల్‌లో అయితే ఏకంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు.
తమిళనాట ఈ పరిస్థితి ఉంటే.. ఏపీలో నేటి రాత్రికి తుఫాన్ కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. గురు, శుక్ర, శనివారాల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మూడు రోజులు మిగిలినచోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
చెన్నై వంటి నగరాలు జలమయం అవుతుండగా, ఏపీలో అటువంటి పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. మొన్న విజయవాడ వరదల అనంతరం వర్షాలు ఏకధాటిగా సాగినా కూడా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా వ్యవహరించడం, ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పొరుగు రాష్ట్రం తమిళనాడు వరదల ఎఫెక్ట్ ఏపీపై కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉండగా, అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రజలు కూడా వర్షాలు కురిసే సమయంలో అధికార యంత్రాంగానికి సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది.