Cyclone Michaung: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని IMD వెల్లడించింది. ఇది క్రమంగా రూపాంతంరం చెందుతూ శనివారానికి తీవ్రవాయుగుండంగా.. ఆదివారం నాటికి తుపాన్ గా మారుతుందని, దీని ప్రభావంతో APలోని పలు చోట్ల ఆది, సోమ వారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మత్స్య కారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. తుపాన్ తీవ్రత నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. పంట కోతలపై అవగాహన కల్పించాలని, రైతులకు అందుబాటులో ఉండాలని సూచించింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో రైతులు కూడా కోతలు కోసి ఉంచిన పంటపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
కాగా.. మిచౌంగ్ తుపాను సోమవారం సాయంత్రానికి చెన్నై-మచిలీపట్నం మధ్య తీరందాటే అవకాశం ఉందని వివరించింది. వాయుగుండం, తుపాను ప్రభావంతో ఆదివారం నుంచి ఏపీ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అలాగే మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.
మరోవైపు తమిళనాడును వర్షాలు వణికిస్తున్నాయి. రెండు రోజులుగా దంచికొడుతున్న వానలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరువళ్లూరు, కాంచీపురం, చెన్నై ప్రాంతాలకు అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. వారంరోజులుగా ఏజెన్సీలో చలి ప్రభావం పెరుగుతోంది. చింతపల్లిలో కనిష్ఠంగా 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం వేళల్లో కాఫీ తోటలు, పంట పొలాలకు వెళ్లే కూలీలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు వణుకుతూ ప్రయాణం చేస్తున్నారు.