Ravichandran Ashwin : వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ రోజున డ్రెస్సింగ్ రూమ్ లో రోహిత్ శర్మ, కొహ్లీ ఇద్దరూ బాగా ఏడ్చారని స్పిన్నర్ అశ్విన్ తెలిపాడు. నిజంగా వారిని చూస్తే నాకు చాలా బాధేసిందని అన్నాడు.
ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో చాలా ఉద్వేగభరితంగా ఉంది. అందరం బాధపడుతున్నాం. అన్ని కోట్లమంది ప్రజల మనసులు ముక్కలైపోయాయి. తమ వల్ల ఎంతమంది బాధపడుతున్నారని తెలిసి, మరింత మానసిక క్షోభకి గురయ్యాం. నిజానికి ఒక దశలో ఆటంటే చికాకు కూడా కలిగింది. కోచ్ రాహుల్ ద్రవిడ్ తో సహా ఎవరి ముఖంలోనూ కళాకాంతులు లేవని అశ్విన్ తెలిపాడు. ఆరోజు డ్రెస్సింగ్ రూమ్ సన్నివేశాన్ని వివరించాడు.
అలా ఓడిపోకుండా ఉండాల్సింది. టీం ఇండియా అద్భుతంగా ఆడింది. అందరికీ ఏం చేయాలో తెలుసు. అందరూ తమ పాత్రకి తగినట్లు సిద్ధమయ్యారు. కోహ్లీ, రోహిత్ ఇద్దరూ సహజ సిద్ధమైన ఆటగాళ్లు. జన్మతహా అది అబ్బిందని తెలిపాడు. అందరిలా ఏదో నేర్చుకుని వచ్చి ఆడేవారు కాదు…వారిలో లయ ఉందని తెలిపాడు. వాళ్లిద్దరూ కలిసి జట్టులో ఒక స్ఫూర్తిని పెంచారు. అందరూ గొప్ప ఫైట్ ఇచ్చేలా చూసుకున్నారు’ అని చెప్పాడు.
‘రోహిత్ గేమ్ లోనే కాదు, ముందు రోజు, తర్వాత రోజు కూడా చాలా కష్టపడతాడు. నిద్ర కూడా మర్చిపోయి మీటింగ్స్‌లో పాల్గొంటాడు. జట్టు వ్యూహాలు అందరికీ అర్థమయ్యేలా చెబుతాడు. భారత క్రికెట్‌లో అడ్వాన్స్‌డ్ కెప్టెన్సీ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. అందరూ కూడా ఎంఎస్ ధోనీ బెస్ట్ కెప్టెన్లలో ఒకడని చెబుతారు. రోహిత్ కూడా అద్భుతమైన కెప్టెన్ అని అశ్విన్ తెలిపాడు. జట్టులోని ప్రతి ఒక్కరిపై తను శ్రద్ధ తీసుకుంటాడు.
అందరి కుటుంబ విషయాలు, యోగక్షేమాలు, మంచీ చెడు అన్నీ తెలుసుకుని, ఒక అన్నయ్యలా సూచనలు, సలహాలు ఇస్తాడు. అన్ని విధాలా సాయపడతాడని తెలిపాడు. మంచి వాతావరణం ఉంటే జోక్స్ వేసి నవ్విస్తాడు. తను ఒక కెప్టెన్ అనే స్ప్రహ అనేదే ఉండదు. ఆ గర్వం ఎక్కడా ప్రదర్శించడని తెలిపాడు.
నాయకుడిలా కాదు, ఒక స్నేహితుడిలా ఆటగాళ్లకు దగ్గరవుతాడని తెలిపాడు. మాకు ఏం ఇష్టమో, ఏది నచ్చదో రోహిత్‌కు తెలుసునని అన్నాడు. అందర్నీ అర్థం చేసుకుంటాడు. వ్యక్తిగతంగా తన వంతు సాయం చేయగలిగినదైతే నిస్సంకోచంగా చేస్తాడు’ అని మెచ్చుకున్నాడు. అందుకే బీసీసీఐ కూడా వారిద్దరికి నెలరోజులు సమయం ఇచ్చింది. అప్పటికైనా జనజీవన స్రవంతిలో కలిసి ఎప్పటిలా గొప్ప క్రికెట్ ఆడుతారని ఆశిద్దాం.