ఆంధ్రప్రదేశ్ ను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకోబోతున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను అరికట్టేందుకు త్వరలోనే పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించబోతున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ నిషేధంపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి శాసనసభలో అడిగిన ప్రశ్నకు ఆయన కీలక సమాధానం చెప్పారు. వాస్తవానికి రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం ఉన్నప్పటికీ, గ్రౌండ్ లెవల్ లో అది సరిగా అమలు కావడం లేదన్నారు.
ప్రస్తుత రోజుల్లో ప్లాస్టిక్ అనేది ప్రజల జీవితాల్లో భాగం అయ్యిందన్న పవన్ కల్యాణ్, దీనికి ప్రత్యామ్నాయ మార్గాలపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్లాస్టిక్ కారణంగా ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయన్నారు. ప్లాస్టిక్ భూమిలో కలిసిపోయేందుకు ఎన్నో ఏండ్ల సమయం పడుతుందన్నారు. నానో ప్లాస్టిక్ బోలెడు అనర్థాలకు కారణం అవుతుందన్నారు. పశువుల కడుపుల్లోకి వెళ్లడం ద్వారా రోగాల బారిన పడుతున్నాయన్నారు. అంతేకాదు, చిన్నారుల రక్తంలోకి కూడా మైక్రో ప్లాస్టిక్స్ చేరుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ కారణంగా ఎదురవుతున్న అనర్థాల నేపథ్యంలో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకోబోతుందన్నారు. వచ్చే రెండు, మూడు నెలల్లోనే ప్లాస్టిక్ నిర్మూలనకు సమగ్ర కార్యచరణ రూపొందించనున్నట్లు తెలిపారు.
ఇక రాష్ట్రంలో ప్లాస్టిక్ మీద ఫైట్ రాజకీయ నాయకుల నుంచే ప్రారంభం కావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. చిన్న కార్యక్రమాలకు కూడా పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని, ఇకపై ఆ పద్దతికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ, సినిమా వేడుకల్లో ఫ్లెక్సీల ఏర్పాటును నిషేధించాల్సిన అవసరం ఉందన్నారు. తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుందన్న ఆయన, సచివాలయంలో ప్లాస్టిక్ వినియోగం నిలిపివేసినట్లు తెలిపారు. ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమంలో ప్రజలు కూడా కలిసి రావాలన్నారు.
అటు అన్ని జిల్లాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రకు సంబంధించి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇకపై ప్లాస్టిక్ రహిత గ్రామాలకు నిర్మల్ గ్రామ పురస్కారం లాంటి పురస్కారాలతో పాటు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. బయోడీగ్రేడబుల్ ఉత్పత్తుల సంస్థలు ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ నిరోధించేందుకు వాటి మూలాలపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు.
అంతకు ముందు ప్లాస్టిక్ నిషేధం విషయంలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ జనసైనికులకు ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. పవన్ ఒక్క ఆదేశం రాష్ట్రంలో మొత్తం ప్లాస్టిక్ ఆగిపోతుందన్నారు. రాజకీయ నాయుకుడి హోదాలో కాకుండా సినిమా నటుడి స్టైల్ లో జనసైనికులకు చెప్పాలని సూచించారు.
Read Also: రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. దసరా సెలవుల్లో మార్పులు, ఎప్పటి వరకు అంటే..?