Tirumala Darshan Update: తిరుమల మాడవీధులు గోవిందా నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఎటుచూసినా భక్తజనసందోహం తిరువీధులలో కనిపిస్తోంది. అలిపిరి నుండి గల కాలినడక దారి భక్తులతో నిండుగా కనిపిస్తోంది. శ్రీ శ్రీనివాసా శరణు.. శరణు అంటూ భక్తులు కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. దీనితో భక్తుల సేవలో తరించే టీటీడీ, ఎటువంటి అసౌకర్యం కలగకుండా.. అన్ని చర్యలు చేపట్టింది. అసలే దీపావళి పర్వదినం రాబోతోంది. దీపావళి ఆస్థానం సైతం స్వామి వారి సన్నిధిలో నిర్వహించడం ఆనవాయితీ. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా ఇప్పటికే టీటీడీ పూర్తి చేసింది. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా, దేశ విదేశాల నుండి స్వామి వారి దర్శనార్థం తిరుమలకు చేరుకుంటున్నారు. ఇలా తిరుమల భక్తుల గోవిందా నామస్మరణతో మారుమ్రోగుతోంది.
ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 6 నుండి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. అలాగే శనివారం స్వామి వారిని 77,844 మంది భక్తులు దర్శించుకోగా.. 27,418 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 3.27 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
ఇటీవల తిరుమలకు భక్తుల రాక పెరిగిందని తాజా లెక్కల ప్రకారం చెప్పవచ్చు. దీపావళి సంధర్భంగా అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకోనుండగా, టీటీడీ అప్రమత్తమైంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అక్టోబరు 30వ తేదీ దీపావళి సందర్భంగా సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు ఆస్థానం వైభవంగా జరుగనుంది. ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరికవళ్ళి అమ్మవారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దీపాలు తీసుకువచ్చి స్వామివారికి సమర్పిస్తారు. అనంతరం ఆలయంలో దీపావళి ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ దీపావళి ఆస్థానంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.
Also Read: Rudra Mantram: ప్రతి సోమవారం ఈ రుద్ర మంత్రాన్ని పఠించండి, శివుడి రక్షణ మీకు ఉంటుంది
అలాగే తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబరు 31వ తేదీన ‘దీపావళి ఆస్థానాన్ని’ టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించనుంది. దీపావళి నాడు ఉదయం 7 నుండి ఉదయం 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది. ఆస్థానంలో భాగంగా శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటుచేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారు. సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది. కాగా సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.