Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోంది? నేతలకు సెక్యూరిటీ భయం ఎందుకు పట్టుకుంది? భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందా? ఎందుకు జనసేన సైనికులు ఆందోళన చెందుతున్నారు? రోజుకో వ్యవహారం వెలుగులోకి రావడంతో జనసేనానికి ముందుస్తు హెచ్చరికలా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఏపీలో పోలీసు అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదా? తన శాఖపై మంత్రి అనితకు పట్టుకోల్పోతున్నారా? పవన్‌కళ్యాణ్ క్యాంప్ ఆఫీసుపై డ్రోన్ హంగామా విషయం ప్రభుత్వంలో తీవ్ర కలకలం రేపుతోంది. శుక్రవారం మధ్యాహ్నం మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంపు ఆఫీసుపై గుర్తు తెలియని డ్రోన్ హల్‌చల్ చేసింది. దాదాపు 10 నుంచి 20 నిమిషాల సేపు ఆకాశంలో చక్కర్లు కొట్టినట్టు స్థానికుల మాట.
ప్రస్తుతం జనసేన పార్టీ ఆఫీసు నిర్మాణం జరుగుతోంది. ఇలాంటి సమయంలో డ్రోన్ ఎగరడంపై పలు అనుమానాలు మొదలయ్యాయి. అధినేత పవన్‌కు ప్రత్యర్థులు పంపిస్తున్న హెచ్చరికలా? అవుననే అంటున్నారు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు. ఈ వ్యవహారంపై క్యాంప్ ఆఫీసు సిబ్బంది డీజీపికి, గుంటూరు కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు.
ఇంకాస్త ముందుకెళ్దాం.. రీసెంట్‌గా విజయవాడలో బుక్ ఫెస్టివల్‌కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. అయితే పవన్ బుక్ స్టాల్ వద్ద ఉన్న సమయంలో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. కారణాలు ఏమైనా కావచ్చు.. జరుగుతున్న పరిణామాలు మాత్రం జనసేన కేడర్‌ని వెంటాడుతున్నాయి.
ALSO READ: సీఎం చంద్రబాబు, పవన్‌తో అమిత్ షా భేటీ.. జగన్ పనైపోయినట్టేనా?
డిసెంబర్‌లో మన్యం జిల్లాలో పర్యటించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఆ సమయంలో నకిలీ ఐపీఎస్ అధికారిగా సూర్యప్రకాష్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ వ్యవహారం జరిగి నాలుగైదు రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై వైసీపీ సైతం అధికార పార్టీని నిలదీసింది. ఈ వ్యవహారంపై హోంమంత్రి అనిత కూడా రియాక్ట్ అయ్యారు.
రంగంలోకి దిగిన పోలీసు అధికారులు, నకిలీ ఐపీఎస్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తాజాగా డిప్యూటీ సీఎం క్యాంపు ఆఫీసుపై డ్రోన్ సంచారం కలకలం రేపుతోంది. దీనిపై ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. వరుసగా జరుగుతున్న ఘటనలు, డిప్యూటీ సీఎం పవన్ భద్రతపై జనసేన కేడర్ ఆందోళన చెందుతోంది.