ఏపీలో కొంతమంది పోలీస్ ఉద్యోగులు ఖాకీ యూనిఫామ్ వేసుకుని పచ్చ ఉద్యోగులుగా చెలామణి అవుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. వారికి టీడీపీ జీతాలివ్వడంలేదని, టీడీపీ నేతల జేబుల్లోనుంచి వారి జీతాలకు ఖర్చు పెట్టడం లేదని, ప్రజలు కష్టపడి సంపాదించిన సొమ్ముతో పన్నులు చెల్లిస్తే దాన్ని జీతంగా తీసుకుంటూ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేయడమేంటని నిలదీశారు.
మచిలీపట్నం సబ్ జైలులో ఉన్న వైసీపీ కార్యకర్తలను మాజీ మంత్రి పేర్ని నాని, వైసీపీ నేత దేవినేని అవినాష్ తదితరులు పరామర్శించారు. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తిరునాళ్లలో జరిగిన ఘర్షణకు సంబంధించి 16పై పోలీసులు కేసు నమోదు చేశారు. వారంతా వైసీపీ సానుభూతిపరులని, అక్రమంగా వారిపై కేసులు పెట్టి రిమాండ్ కి తరలించారని ఆ పార్టీ నేతలంటున్నారు. ఈ క్రమంలో వారిని పరామర్శించేందుకు పేర్ని నాని సహా మరికొందరు నేతలు జైలుకి వెళ్లారు. అసలు సంబంధం లేకపోయినా, జగన్ ని అభిమానిస్తున్నారనే కారణంతో సంఘటన జరిగిన సమయంలో అక్కడ లేనివారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారని ఆరోపించారు పేర్ని నాని.
తిరునాళ్లలో టీడీపీ నేతలకు సంబంధించిన ప్రబలపైనుంచి కొందరు వైసీపీ అభిమానుల్ని రెచ్చగొట్టేలా మాట్లాడారని అన్నారు పేర్ని నాని. ఆ మాటలు పోలీసులకు వినపడినా వారు చెవులు మూసుకుని ఉన్నారని, ఆ తర్వాత వైసీపీ ప్రభలపై టీడీపీ వాళ్లు రాళ్లు రువ్వారని, కర్రలు విసిరారని అయినా కూడా వైసీపీ శ్రేణులు సంయమనం పాటించాయని చెప్పారు. చివరకు ఆత్మరక్షణ కోసం ఆ దాడిని వైసీపీ శ్రేణులు అడ్డుకోవాలని చూస్తే అప్పుడు పోలీసులు తమ వారిని నిలువరించారని, టీడీపీకి వత్తాసు పలికారని అన్నారు పేర్ని నాని.
టీడీపీ కార్యకర్తలు గొడవ చేస్తుంటే పోలీసులు స్పందించకపోగా.. బాధితులైన వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడం దారుణం అని అన్నారు. జాతరలో ప్రభలకు పూజలు చేస్తున్న ఓ పూజారి కుమారుడిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారన్నారు. ఈ రాష్ట్రంలో చట్టం, న్యాయం, ధర్మం లేవని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలకు పోలీసులు తొత్తులుగా మారిపోయారన్నారు. పసుపు ఉద్యోగులంటూ మండిపడ్డారు. ఖాకీ చొక్కాల మాటున, టీడీపీకి వత్తాసు పలుకుతూ వారు ఉద్యోగాలు చేస్తున్నారని అన్నారు. పెనుగంచి పోలీసులు ఎప్పటికైనా సమాధానం చెప్పుకోవాల్సిన రోజు వస్తుందని హెచ్చరించారు. ఆ రోజు మూడేళ్లకయినా, లేక నాలుగేళ్లకైనా, ఐదేళ్లకైనా రావొచ్చని అన్నారు పేర్ని నాని.
అయితే పెనుగంచిప్రోలు ఘటనపై టీడీపీ వాదన మరోలా ఉంది. తిరునాళ్లలో వైసీపీ వాళ్లు కావాలనే తమపై దాడి చేశారనేది వారి ఆరోపణ. అదే సమయంలో పోలీసులపై కూడా వైసీపీ కార్యకర్తలు కొందరు దాడి చేశారని, గాయపరిచారని అంటున్నారు. పెనుగంచిప్రోలు ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే అందులో తమవారి తప్పులేదని వైసీపీ అంటే, తమవారిది అసలు తప్పే కాదని టీడీపీ నేతలు చెబుతున్నారు. చివరకు వైసీపీ నేతలు పోలీసుల్ని టార్గెట్ చేయడం విశేషం. తప్పుడు కేసుల్లో తమ వాళ్లని పోలీసులు ఇరికించారని, కచ్చితంగా సమాధానం చెప్పుకునే రోజు వస్తుందని పేర్ని నాని అన్నారు.