TS Assembly: లైఫ్ స్టైల్.. స్టేచర్.. పై తెలంగాణ అసెంబ్లీలో కాసేపు ఆసక్తికర డైలాగ్ వార్ నడిచింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సీతక్కను టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. వెంటనే మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వగా.. మరో మంత్రి శ్రీధర్‌బాబు సైతం ఆమెకు సపోర్ట్‌గా మాట్లాడటంతో.. పాడి పారిపోయినంత పని చేశారు. ఇంతకీ అసెంబ్లీలో అసలేం జరిగిందంటే….
అసెంబ్లీలో రైతులు, వ్యవసాయంపై ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మాట్లాడారు. రైతు భరోసా 12వేలు మాత్రమే ఇస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చిందని.. యూరియా కొరత ఉందని.. వరికి బోనస్ ఓ బోగస్ అంటూ చెప్పుకొచ్చారు. ఆ సందర్భంలో సీతక్క అడ్డుతగిలి సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నామని.. కేసీఆర్ హయాంలో వరి వేస్తే ఉరి అన్నారని.. రైతులతో సంబంధం లేకుండా హైదరాబాద్‌లో ఉండే కౌశిక్‌రెడ్డి రైతుల గురించి ఏం తెలుసంటూ కౌంటర్ ఇచ్చారు.
సీతక్క మాటలపై రియాక్ట్ అయిన కౌశిక్‌రెడ్డి కాస్త కాంట్రవర్సీ స్టేట్‌మెంట్ చేశారు. సీతక్క లైఫ్‌స్టైల్ వేరని.. తన లైఫ్‌స్టైల్ వేరని అన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కట్టించిన.. ముఖ్యమంత్రి నివసించిన.. 5 ఎకరాల భవనంలో సీతక్క ఉంటున్నారని.. తాను మాత్రం 500 గజాల ఇంట్లో ఉంటున్నానంటూ సెటైరికల్ కామెంట్ చేశారు కౌశిక్‌రెడ్డి.
పాడి ఆరోపణలపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. తన లైఫ్ స్టైల్ గురించి మాట్లాడటం తగదని.. వైఎస్సార్ కట్టించిన బిల్డింగ్‌ను నతనకు ప్రభుత్వ క్వార్టర్‌గా ఇచ్చారని అదేమీ తన సొంతం కాదన్నారు. తన స్థాయికి సర్కారు ఇచ్చిన ఆ భవనం చాలా ఎక్కువ అని కూడా చెప్పారు. ప్రజా భవన్‌గా మారిన పాత ప్రగతి భవన్ గురించే డైలాగ్ వార్ జోరుగానే సాగింది.
Also Read : బీజేపీలో బ్యాక్‌డోర్ పాలిటిక్స్ చేస్తున్నది ఎవరు?
తను ఉంటున్న భవనం 5 ఎకరాలు ఉండదని.. కావాలంటే బీఆర్ఎస్ నేతలంతా కలిసి తన ఇల్లు చూసేందుకు ఎప్పుడైనా రావొచ్చని మంత్రి సీతక్క ఆహ్వానించారు. గతంలో ప్రగతిభవన్ లోనికి కూడా రానిచ్చే వారు కాదని.. తాను మాత్రం ఇంటికొచ్చిన గులాబీ నేతలందరికీ భోజనాలు కూడా పెడతానని వెల్‌కమ్ చెప్పారు. వైఎస్సార్ కట్టించిన ఇంట్లో ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని.. మీలాగా ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కోటల్లో నివసించడం లేదంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు మంత్రి సీతక్క. తనది నిరాడంబర జీవితమని.. తన కుమారుడు కూడా వరంగల్‌లోనే ఉంటాడని చెప్పారు.
ఇదే టైమ్‌లో మరో మంత్రి శ్రీధర్‌బాబు మైక్ తీసుకుని.. మంత్రి అయిన ఆదివాసీ బిడ్డను అలా అనొచ్చా అంటూ పాడి కౌశిక్‌రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఇలా మాట్లాడటం సరైన పద్దతి కాదని సూచించారు. శ్రీధర్‌బాబు హితబోధకు సరెండర్ అయిన పాడి.. తాను శ్రీధరన్నతోనే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకొచ్చారు. తనకు రాజకీయం నేర్పించింది హరీశ్‌రావు కాదని.. శ్రీధరన్ననే అని.. సీతక్క అంటే తనకు గౌరవమని.. తాను ఆమెను పర్సనల్‌గా ఏమీ అనలేదంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు పాడి కౌశిక్‌రెడ్డి. బయట పబ్లిక్‌లో మాట్లాడినట్టే అసెంబ్లీలో కూడా మాట్లాడితే ఆటలు సాగవు ఎమ్మెల్యే గారు. ఇకనైనా కాస్త కంట్రోల్.. కంట్రోల్.