కొమ్మినేని బుద్ధిమంతుడు..
ఆయన తప్పు చేయరు..
టీవీ చర్చల్లో తప్పుగా మాట్లాడితే అస్సలు ఒప్పుకోరు..
అమరావతిపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన సాక్షి టీవీ ఉద్యోగి కొమ్మినేని శ్రీనివాసరావు గురించి మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలివి. అసలు కొమ్మినేని చాలా పద్ధతైన మనిషని.. ఆయన్ను వెనకేసుకు వచ్చే ప్రయత్నం చేశారు రోజా. టీవీ చర్చల్లో ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఆయన అస్సలు ఊరుకోరని అన్నారు. వాస్తవానికి కృష్ణంరాజు అనే జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు వైరల్ కాకముందే కొమ్మినేని సారీ చెప్పారని, సాక్షి టీవీ యాజమాన్యం కూడా స్పందించిందని అంటున్నారు రోజా. కానీ కావాలనే ఓ పద్ధతి ప్రకారం కొమ్మినేనిపై కేసు పెట్టారని అంటున్నారామె. ఎవరో ఏదో మాట్లాడితే దానికి ఆయన ఎలా బాధ్యుడు అవుతారని అడిగారు. సంబంధం లేకుండా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని మండిపడ్డారు రోజా.
నవ్వాలా..? ఏడ్వాలా..?
సాక్షి టీవీ డిస్కషన్ లో ఒక జర్నలిస్ట్ మాట్లాడిన మాటలకు జగన్ కు, భారతికి ఏం సంబంధం అని నిలదీశారు రోజా. అసలు సంబంధమే లేని వ్యవహారంలో వారిద్దరూ ఎందుకు క్షమాపణ చెప్పాలని అడిగారు. అసలు క్షమాపణ అంటూ చెప్పాల్సి వస్తే.. ముందుగా టీడీపీ నేతలు చెప్పాలన్నారు. కోడలు మగబిడ్డని కంటే అత్త సంతోషించదా అంటూ ఆడవారి పుట్టుకనే చంద్రబాబు అవమానించారని చెప్పారు రోజా. ఆడపిల్ల కనపడితే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి అన్న బాలకృష్ణపై ఎందుకు కేసు పెట్టకూడదన్నారు. జగన్ తన కూతుర్ని చూడటానికి లండన్ కి వెళ్లినప్పుడు లోకేష్ నీఛంగా మాట్లాడారని చెప్పారు. భారతమ్మ, విజమ్మ గురించి.. ప్రస్తుత మంత్రి అనిత ఘోరంగా మాట్లాడారని.. ఆమెపై కూడా కేసు పెట్టాలన్నారు రోజా. వారందరిపై కేసు పెట్టకుండా సంబంధం లేని విషయంలో జగన్, భారతి క్షమాపణలు చెప్పాలని అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
మహిళలకు ముందు క్షమాపణ చెప్పాలనిపిస్తే చంద్రబాబు, బాలకృష్ణ నారా లోకేష్ , బండారు సత్యనారాయణ, రేణుకా చౌదరి, మూర్తి, బీఆర్ నాయుడు, చేబోలు కిరణ్ లు చెప్పాలి
-రోజా మాస్ కౌంటర్ 🔥 pic.twitter.com/A9W3KsmGbI
— Rahul (@2024YCP) June 10, 2025
నన్ను బూతులు తిట్టించారు..
గతంలో తనను బండారు సత్యనారాయణ ద్వారా బూతులు తిట్టించారని చెప్పారు రోజా. ఆయనతో అలా మాట్లాడించిన చంద్రబాబు, లోకేష్ వెంటనే తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారుల్ని, అప్పటి హోం మంత్రి సుచరితను, తనను కూడా వల్గర్ గా మాట్లాడారని, దానికి క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. చేబ్రోలు కిరణ్, భారతి మేడమ్ ని అసభ్యంగా మాట్లాడారని, అతడి వెనకున్నవారిపై కూడా కేసులు పెట్టాలన్నారు. టీవీ-5 డిస్కషన్ లో తెలంగాణ కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి అడ్డదిడ్డంగా మాట్లాడారని, ఆమెపై, ఆ డిస్కషన్ చేసిన మూర్తిపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు రోజా. బీఆర్ నాయుడు కూడా క్షమాపణ చెప్పాలన్నారు.
కృష్ణంరాజు మాట్లాడిన విధానం తప్పు అయితే టైమ్స్ ఆఫ్ ఇండియ, ఈటీవీలో కూడా ఆ అంశం గురించి వార్తలొచ్చాయని, కేవలం ససాక్షిపై మాత్రమే దాడులు ఎందుకని ప్రశ్నించారు రోజా.
కొమ్మినేని వ్యవహారంలో వైసీపీ దాదాపుగా సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టే చెప్పాలి. అప్పుడెందుకు క్షమాపణ చెప్పలేదు అని అడుగుతున్నారే కానీ, ఇప్పుడు కొమ్మినేని చేసింది, సాక్షిలో జరిగింది తప్పు అని ఒక్క మాట కూడా వైసీపీ నేతలు చెప్పకపోవడం ఇక్కడ గమనార్హం. దీంతో గొడవ పెద్దదిగా మారింది. తప్పుని తప్పు అని ఖండించకుండా ఇంకా సాగదీయాలనుకోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. మరోవైపు కొమ్మినేని శ్రీనివాస్ కి కోర్టు 2వారాల రిమాండ్ విధించింది.