మాజీ మంత్రి విడదల రజిని ప్రస్తుత ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలుపై సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వంలో ఆయన వైసీపీలో ఎంపీగా ఉన్నప్పుడు తన కాల్ డేటాను సేకరించారని అన్నారు. యతన కాల్ డేటాతో ఆయనకేం పని అని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా ఆయనకు తనపై కోపం ఉందని, ఆ కోపంతోనే తనను కేసుల్లో ఇరికించారని అన్నారు రజిని.
టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు డైరెక్షన్లో ఓ కట్టుకథ అల్లారు. ఎవరో తెలియని వ్యక్తితో ఏసీబీ కేస్ నాపై పెట్టించారు.
మా పార్టీలో ఉండగానే ఎంపీగా ఉన్న లావు కృష్ణదేవరాయలు నా ఫోన్ నెంబర్ నా కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్ల కాల్ డేటాను తీశారు.
-విడదల రజిని గారు, మాజీ మంత్రి, చిలకలూరిపేట… pic.twitter.com/Ej7oxsw0Iq
— YSR Congress Party (@YSRCParty) March 23, 2025
గత రెండు రోజులుగా మాజీ మంత్రి విడదల రజిని పేరు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆమె అక్రమాలకు పాల్పడ్డారని, స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపణలు వినిపించాయి. ఆ ఆరోపణలు నిజమని నిర్థారించుకున్న ఏసీబీ ఆమెపై కేసు నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ దాఖలు కావడంతో రేపోమాపో విడదల రజిని అరెస్ట్ ఖాయమని అనుకుంటున్నారంతా. ఈ క్రమంలో ఆమె తనపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని విమర్శిస్తూ ట్వీట్ వేశారు. వంద కేసులను, వేయ్యి ప్రచారాలను సైతం తాను ఒంటి చేత్తో ఎదుర్కొంటానన్నారు. “మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్రలు. వ్యక్తిత్వాన్ని హరించాలనే కుయుక్తులు. ఒక మహిళ నైన నా పై అక్రమ కేసులు, విష ప్రచారాలే మీ లక్ష్యమైతే అలాంటి వంద కేసులను, వేయి ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కోడానికి నేను సిద్ధం. నా ధైర్యం నా నిజాయితీ నా ధైర్యం నేను నమ్మే సత్యం, ధర్మం. నేను ఎదురు చూస్తూ ఉంటా.నిజం బయట పడ్డాక మీ ముఖాలు ఎలా ఉంటాయో చూడటానికి..” అని ట్వీట్ చేశారు.
ఆ తర్వాత సీన్ మరో మలుపు తిరిగింది. ఇది ప్రభుత్వ కుట్ర అంటూ ఇంత సేపూ చెప్పుకొచ్చిన విడదల రజిని, ఇప్పుడు మరో పేరు బయటకు తీసింది. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలుకి తనపై కోపం ఉందని, ఆయనే ఇదంతా చేయించారని ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపించారు మాజీ మంత్రి రజిని.
అయితే ఆమె చెబుతున్న కాల్ డేటా సేకరణ సంఘటన వైసీపీ హయాంలో జరిగింది. అప్పట్లో ఆయనపై జగన్ కి ఫిర్యాదు చేయగా.. కాల్ డేటా సేకరణకు సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకున్నారని చెప్పారు. అయితే అప్పుడే ఎంపీగా ఉన్న శ్రీకృష్ణ దేవరాయలుపై జగన్ ఎందుకు చర్యలు తీసుకోలేదో ఆమె చెప్పలేకపోయారు. ఆ వ్యవహారాన్ని అప్పుడు గుట్టుగా ఉంచి, ఇప్పుడు బయటపెట్టడంలో ఆమె ఉద్దేశమేంటని వైరి వర్గాలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి.
అరెస్ట్ ఖాయం అనుకుంటున్న ఈ టైమ్ లో విడదల రజిని, ఒక ఎంపీపై సంచలన ఆరోపణలు చేయడం ఆసక్తికరంగా మారింది. వారిద్దరి మధ్య గొడవని సరిగ్గా ఈ టైమ్ లో బయటపెట్టడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
ఫిర్యాదు చేసిన వారితో తనకెలాంటి సంబంధం లేదని అంటున్నారు విడదల రజిని. ఏపీలో రెడ్ బుక్ అరాచకాలు తారాస్థాయికి చేరాయని విమర్శించారు. తనపై ఏసీబీ అక్రమంగా కేసు నమోదు చేసిందని, కూటమి నేతల బెదిరింపులకు తాను భయపడేది లేదన్నారామె. ప్రజలకు సేవ చేయడానికి తాను రాజకీయాల్లోకి వస్తే, రెడ్ బుక్ పాలనలో తనను టార్గెట్ చేశారని అన్నారు. ఒక బీసీని, ఒక మహిళను.. నన్ను ఇంతగా టార్గెట్ చేస్తారా అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.