Sekhar Kammula: దర్శకులంటే ఇండస్ట్రీ హిట్స్ ఉండి, రూ.100 కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తెరకెక్కించి, పాన్ ఇండియా అనే ట్యాగ్ సొంతం చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రేక్షకులు ఇష్టపడి పదేపదే చూడగలిగే సినిమాలు తెరకెక్కిస్తే చాలు.. అని నిరూపించిన దర్శకులు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌లోనే అలాంటి డైరెక్టర్స్ సంఖ్య ఎక్కువగా ఉంది. అలాంటి దర్శకుల్లో శేఖర్ కమ్ముల కూడా ఒకరు. శేఖర్ కమ్ములకు, ఆయన సినిమాలకు అభిమానులు ఎక్కువ. ఎప్పుడూ ఫీల్ గుడ్ సినిమాలను తెరకెక్కించే ఆయన.. మొదటిసారి రూటు మార్చి ‘కుబేర’ (Kubera) అనే క్రైమ్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా దానికి సంబంధించిన సాలిడ్ అప్డేట్ అందించాడు.
షాక్‌లో ప్రేక్షకులు
ధనుష్, నాగార్జున, రష్మిక మందనా కాంబినేషన్‌లో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రమే ‘కుబేర’. దర్శకుడిగా కెరీర్ ప్రారంభించినప్పటి నుండి పెద్దగా స్టార్లను డైరెక్ట్ చేయలేదు శేఖర్ కమ్ముల. తను రాసుకున్న పాత్రలకు తగిన హీరో, హీరోయిన్లను మాత్రమే ఎంపిక చేసుకునేవాడు. అలాంటి మొదటిసారి ధనుష్, నాగార్జున లాంటి స్టార్లను డైరెక్ట్ చేయడానికి సిద్ధమయ్యాడు. అప్పుడే ప్రేక్షకులు చాలా ఆశ్చర్యపోయారు. కొన్నాళ్ల పాటు మూవీ లవర్స్‌లో ఇదే హాట్ టాపిక్ నడిచింది. ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ చూసి అందరూ మరింత షాకయ్యారు. ఇదొక క్రైమ్ థ్రిల్లర్‌లాగా ఉందని, శేఖర్ కమ్ముల ఇలాంటి సినిమా తెరకెక్కించడం ఏంటని అనుకున్నారు.
వావ్ అంటారు
తాజాగా హైదరాబాద్‌లో రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుండగా అందులో శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ‘హ్యాపీ డేస్’ సినిమా కూడా స్పెషల్ స్క్రీనింగ్ జరుపుకుంది. దీంతో తను కూడా ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. అక్కడ ‘కుబేర’ గురించి, తన ఇతర సినిమాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘కుబేర కథ ధనుష్, నాగార్జున, రష్మిక లాంటి స్టార్లను డిమాండ్ చేసింది. ఆడియన్స్ అంతా సినిమా చూసి వావ్ అనుకుంటారు అనే నమ్మకంతో నేను ఉన్నాను’’ అని తెలిపాడు. దీంతో ‘కుబేర’ విషయంలో శేఖర్ కమ్ముల చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడని, ఈ సినిమాను వెండితెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
Also Read: నాకేం ఎఫెక్ట్ పడలేదు.. ఫ్యాన్‌ను ముద్దు పెట్టుకోవడంపై సింగర్ ఓపెన్ కామెంట్స్
అదే నమ్ముతాను
‘‘నేను నా సినిమాల ద్వారా గొప్ప గొప్ప మెసేజ్‌లు ఇవ్వకపోవచ్చు. కానీ ఈ దేశానికి సంబంధించిన గౌరవాన్ని నా సినిమాలు పాడు చేయకూడదని నేను గట్టిగా నమ్ముతాను. సినిమాలు చేసేటప్పుడు ఇదే విషయాన్ని మైండ్‌లో పెట్టుకుంటాను’’ అని చెప్పుకొచ్చాడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula). మొత్తానికి కెరీర్‌లో మొదటిసారిగా ‘కుబేర’తో ఒక కొత్త ప్రయోగం చేయనున్నాడు ఈ దర్శకుడు. ఇప్పటికే ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. కానీ రిలీజ్ లేట్ అవ్వడం చాలామంది ప్రేక్షకులకు నచ్చడం లేదు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమీగోస్ క్రియేషన్స్ కలిపి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నాడు.