Pastor Pagadala Praveen: పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో పోలీసులు వ్యవహార శైలిపై అనేక అనుమానాలు మొదలవుతున్నాయి. ఈ క్రమంలో కూటమి సర్కార్‌ని హెచ్చరించారు మాజీ ఎంపీ హర్షకుమార్. ప్రవీణ్‌ది ముమ్మాటికీ హత్యేనని కుండబద్దలు కొట్టేశారు. ఈ విషయం పోలీసులు, డాక్టర్లకు తెలుసని అన్నారు. అతడ్ని కావాలనే చంపేశారన్నారు.
హర్షకుమార్ ఏమన్నారు?
పాస్టర్ ప్రవీణ్ కేసు విచారణ పారదర్శకంగా చేయాలన్నారు. ప్రైమరీ రిపోర్టు రావాలంటే రెండు లేదా మూడు రోజులు పడుతుందన్నారు. కాకపోతే ఆరేడు గంటల్లో కూడా ఇవ్వవచ్చని అన్నారు. సంచలనం కేసు కాబట్టి మూడు రోజుల్లో ప్రాథమిక రిపోర్టు ఇవ్వాలన్నారు. ఆ తర్వాత మూడు లేదా నాలుగు వారాల్లో ఫోరెన్సిక్ ల్యాబ్ (ఎఫ్ఎల్సీ) రిపోర్టు కావాలన్నారు. రిపోర్టు ఏ విధంగా ఇస్తారో తాము చూస్తామన్నారు.
ఒకవేళ కేసు తప్పుదారి పట్టిస్తే అందరూ ఇరుక్కుంటారని ఘాటుగా హెచ్చరించారు. ప్రవీణ్ పగడాలది ముమ్మాటికీ హత్యేనని చెప్పారు. ఈ కేసు మేనేజ్ చేయాలని ప్రభుత్వం భావించినా ఇరుక్కుంటుందన్నారు. ప్రవీణ్ రెండు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి అని అన్నారు. తన గురించి అందరికీ తెలుసన్నారు.
డాక్టర్లు కచ్చితమైన రిపోర్టు ఇవ్వాలని, తప్పుడు నివేదిక ఇస్తే ఉద్యోగాలు పోతాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, రీపోస్టుమార్టం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో మళ్లీ విచారణ చేయిస్తామన్నారు. పోస్టుమార్టం సమయంలో వచ్చిన జనం చూసి పోలీసులు కంగారు పడ్డారని అన్నారు.
ALSO READ: ఇకపై వేగంగా శ్రీవారి దర్శనం, ఎందుకంటే..
అంతకుముందు ఏమన్నారు?
పాస్టర్ ప్రవీణ్ కేసు విషయంలో మొదటి నుంచి పోలీసుల వైఖరిని తప్పుబడుతున్నారు మాజీ ఎంపీ హర్షకుమార్. కావాలనే ఈ కేసును పోలీసులు తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. తాను గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు వెళ్లినప్పుడు రెండు గంటల్లో సీసీటీవీ ఫుటేజ్ వస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. సాయంత్రం ఆరు గంటల వరకు ఇవ్వలేదన్నారు. ఆలస్యం వెనుక కారణం ఏంటో తెలీదన్నారు.
చివరకు ఫుటేజ్ చూపించి 90 శాతం రోడ్డు ప్రమాదమని చెప్పి కొంత ఒత్తిడి తెచ్చారన్నారు. అందుకు తాము ససేమరా అంగీకరించలేదన్నారు.ఇది యాక్సిడెంట్ కాదు.. ముమ్మాటికీ హత్యలేనని అన్నారు. అక్కడ ప్రమాదం జరిగినట్టు ఎలాంటి ఆనవాళ్లు ఏమీ లేవన్నారు. కొవ్వూరు ఫుటేజ్ చూపించి ఎలాంటి క్లూ దొరకలేదన్నారు.
రిలీజైన సీసీటీవీ ఫుటేజ్‌లో ఒక బైక్ వెళ్లినట్టుగా క్లిప్పింగులో ఉందన్నారు. దానికి ముందు క్లిప్పింగ్ ఏమైంది? ఆ విషయం తెలిస్తే ఘటనపై క్లారిటీ వస్తుందన్నారు. ఇది అనుమానాస్పద మృతి కేసని ఎలా నమోదు చేశారని ప్రశ్నించారు. యాక్సిడెంట్ కమ్ మర్డర్ అని ప్రకటించిన తర్వాత పోలీసులు విచారణ చేయాలన్నారు.
ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు టెక్నికల్ ఎవిడెన్స్‌పై ఆధారపడ్డారు. కాకపోతే దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు కనిపించలేదని అంటున్నారు. ఈ ఘటనపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక పాస్టర్ ప్రవీణ్ పగడాలది ప్రమాదమా? లేక హత్యా అనేది తేలనుంది.