దేశంలో రోజూ లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. తక్కువ ఖర్చులో ఆహ్లాదకరంగా రాకపోకలు కొనసాగిస్తారు. అయితే, రైలు ఎక్కాలంటే కచ్చితంగా టికెట్ తీసుకోవాలి. ఒకవేళ టికెట్ లేకుండా రైలు ఎక్కి, టీసీకి దొరికితే జరిమానా కట్టాల్సి ఉంటుంది. కొన్నిసార్లు జైలు శిక్షకూడా పడుతుంది. కానీ, మన దేశంలో ఓ రైల్లో ఎలాంటి టికెట్ లేకుండా ప్రయాణం చేయవచ్చు. ఫ్రీగా వెళ్లొచ్చు. ఇందులో టీసీ ఉండడు. టికెట్ చెకింగ్ మాటే లేదు. ఇంతకీ ఈ రైలు ఎక్కడుంది? ఎందుకు ఇందులో ఉచిత ప్రయాణం అందిస్తున్నారు? అనేది ఇప్పుడు చూద్దాం..
దేశంలో 75 ఏండ్లుగా ఈ ఉచిత ప్రయాణ సేవ అందిస్తున్న ఈ రైలు హిమాచల్ ప్రదేశ్- పంజాబ్ మధ్యలో నడుస్తున్నది. హిమాచల్ ప్రదేశ్ లోని భాక్రా, పంజాబ్ లోని నంగల్ మధ్య సుమారు 13 కిలో మీటర్ల మార్గంలో రాకపోకలు కొనసాగిస్తుంది. ఈ రైలు మొత్తం 6 స్టేషన్లలో ఆగుతుంది. మూడు సొరంగ మార్గాల గుండా పరుగులు తీస్తుంది. అద్భుతమైన ప్రకృతి అందాల జర్నీ చేస్తుంది.
భాక్రా-నంగల్ రైలు 1948లో ప్రారంభించబడింది. దేశ స్వాతంత్ర్యం అనంతరం మొదటి పంచవర్ష ప్రణాళికలో భాగంగా భాక్రా-నంగల్ ప్రాజెక్టు నిర్మాణానికి భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు నిర్మాణం మొదలయ్యింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం సమయంలో కార్మికులతో పాటు నిర్మాణ సామాగ్రిని తీసుకెళ్లడంలో ఈ రైలు కీలక పాత్ర పోషించింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినప్పటికీ ఈ రైలును అలాగే కొనసాగించారు. ప్రాజెక్టు పరిసర గ్రామ ప్రజలు, విద్యార్ధులు ఈ రైలు ద్వారా ప్రయాణించడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రైలు ఉచితంగానే సర్వీసులు అందిస్తున్నది. రోజూ సుమారు 800 మందికి పైగా జనాలు ఈ రైల్లో ప్రయాణిస్తున్నారు. సట్లెజ్ నది, శివాలిక్ కొండల మీదుగా ఈ రైలు ప్రయాణం కొనసాగిస్తుంది.
Read Also: 300 మైళ్ల ప్రయాణం.. రూ. 350కే టికెట్.. మయన్మార్ లో ట్రైన్ జర్నీ ఇలా ఉంటుందా?
దేశంలోని అన్ని రైళ్లను భారతీయ రైల్వే నడిపిస్తుండగా, ఈ రైలును మాత్రం భాక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డు(BBMB) ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ రైలు నిర్వహణకు భారీగా ఖర్చు అవుతున్నప్పటికీ తన ఉచిత ప్రయాణాన్ని అందిస్తుంది. ఈ రైలు ప్రారంభించిన తొలినాళ్లలో స్ట్రీమ్ ఇంజిన్ ను ఉపయోగించే వాళ్లు. 1953లో డీజిల్ ఇంజిన్ ను తీసుకొచ్చారు. భాక్రా-నంగల్ ప్రాజెక్టును చూసేందుకు వచ్చే పర్యాటకులు సైతం ఈ రైలులో ఉచితంగా ప్రయాణిస్తారు. ఈ రైలును ఎక్కువగా విద్యార్థులు, స్థానికులు ప్రయాణం చేయడానికి ఉపయోగించుకుంటున్నారు. ఇందులో టికెట్ అవసరం లేదు. మధ్య మధ్యలో చెకింగ్ అధికారులు ఉండరు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా జర్నీ చెయ్యొచ్చు.
Read Also: ఫోన్ చూస్తూ డ్రైవింగ్.. రెప్పపాటులో ఘోరం, ఈ వీడియో చూస్తే ఏమైపోతారో!