గతంలో గుడివాడ నియోజకవర్గం అంటే నానీ అడ్డా. అక్కడ ఆయన చెప్పిందే వేదం. వరుస విజయాలతో జోరుమీదున్న ఉన్న నానీకి 2024 ఎన్నికలు స్పీడ్ బ్రేకర్ గా నిలిచాయి. అక్కడ టీడీపీ నుంచి వెనిగండ్ల రాము ఎమ్మెల్యేగా గెలిచారు. నానీకి ఓటమిని రుచి చూపించారు. ఆ తర్వాత గుడివాడలో నానీ వర్గం హడావిడి బాగా తగ్గింది. ఎన్నికల తర్వాత ఆయన అజ్ఞాతంలో ఉండటం, ఆస్పత్రిలో ఉండటంతో అక్కడ వైసీపీ కార్యక్రమాలు కూడా లేవు. తీరా ఇప్పుడు మళ్లీ నానీ వర్గం అలర్ట్ అయింది. ఆయన ఆస్పత్రినుంచి బయటకు రావడంతో పార్టీ కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వర్గం నానీ అనుచరులకు షాకిచ్చింది.
గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి పర్యాయపదంగా మారారు కొడాలి నాని. వరుసగా నాలుగుసార్లు అ్కకడ్నుంచి గెలుపొందారు. రెండుసార్లు టీడీపీ నుంచి, మరో రెండుసార్లు వైసీపీనుంచి గెలిచారు నాని. దీంతో అక్కడ ఆయనకు బలమైన వర్గం ఏర్పడింది. పార్టీలకు అతీతంగా నానీకి అనుచరగణం ఉంది. ప్రస్తుతం వారంతా వైసీపీలోనే ఉన్నా.. 2024లో మాత్రం ఆయన విజయాలకు బ్రేక్ పడింది. గుడివాడలో నానీని ఓడించడం అంత ఈజీకాదు అనే దశ నుంచి.. టీడీపీ దెబ్బకు నానీ కూడా ఓడిపోవాల్సిందే అనే స్టేజ్ కి తీసుకొచ్చారు వెనిగండ్ల రాము. నానికి ప్రత్యర్థిగా ఆయన టీడీపీ తరపున బలమైన పోరాటం చేశారు. చివరకు విజయం సాధించారు. అయితే నానీ అనుచరులు మాత్రం ఓడిపోయినా గుడివాడలో తమ హవా చూపించాలని అనుకుంటున్నారు. కొన్నాళ్లుగా నానీ అజ్ఞాతవాసంలో ఉండటంతో వారు కూడా సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఆస్పత్రినుంచి బయటకు రావడం, తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ కావడంతో నానీ అనుచరులు కూడా బస్తీమే సవాల్ అంటున్నారు. దీంతో అక్కడ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గాల మధ్య గొడవలు మొదలయ్యాయి.
ప్రస్తుతం ఏపీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. అదే సమయంలో ప్రతిపక్ష వైసీపీ.. చంద్రబాబు హామీలను గుర్తుచేస్తూ అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. ఈ రెండిటి వల్ల ఇప్పుడు గుడివాడలో గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో లింగవరంలో గుడివాడ నియోజకవర్గ స్థాయి వైసీపీ సమావేశం జరిగింది. కొడాలి నానీకి చెందిన కె కన్వెన్షన్ లో మీటింగ్ పెట్టుకున్నారు. అదే సమయంలో లింగవరంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము.. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రంలో భాగంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. రెండు పార్టీల నేతల హడావిడితో నాగవరప్పాడు సెంటర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రెండు రాజకీయ పార్టీల బ్యానర్లు వివాదానికి కారణమయ్యాయి. ఒకరి బ్యానర్లను ఇంకొకరు చించేసుకునే పరిస్థితిలో పోలీసులు ఎంటరయ్యారు. ఇక వైసీపీనేత, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పల హారిక కారుని కొంతమంది ధ్వంసం చేశారు. పోలీసులు ఎంటరై ఆ కారుని వెనక్కి పంపించేశారు. వైసీపీ అనుకున్నట్టుగా నియోజకవర్గ పార్టీ మీటింగ్ సజావుగా సాగలేదు. దీంతో ఆ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే గుడివాడ నియోజకవర్గంలో అలజడి సృష్టిస్తున్నారని విమర్శిస్తున్నారు. అటు టీడీపీ మాత్రం గుడివాడపై మరింత పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. ఎమ్మెల్యే రాము వర్గీయులు తగ్గేది లేదంటున్నారు. ఒకప్పుడు గుడివాడలో నానీ వర్గాన్ని కాదని, ఆయన అనుచరులను కాదని ఏ మీటింగ్ కూడా జరిగేది కాదు. కానీ ఇప్పుడు వైసీపీ మీటింగ్ పెట్టుకోడానికే నానీ వర్గం ఆపసోపాలు పడుతోంది. గుడివాడలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము.. కొడాలి నానీకి పూర్తి స్థాయిలో చెక్ పెట్టారని అంటున్నారు టీడీపీ నేతలు.