Garikapati Controversy: తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ప్రవచన కర్తల్లో గరికపాటి నరసింహరావు ఒకరు. వేదాలు, ఉపనిషత్తుల్లోని అంశాలను ప్రస్తుత కాలానికి ముడిపెడుతూ ఎంతో వ్యగ్యంగా ప్రవచనాలు చెప్పడంలో ఆయన దిట్ట. ఈ క్రమంలోనే తరుచూ పదాలు జారుతూ ఆయన పలుమార్లు వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ను తెలుగునాడుగా మార్చాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వచ్చాయి. అది మర్చిపోకముందే తాజాగా మధ్యాహ్నం భోజనం పథకంలో పెట్టే గుడ్డుపై ఆయన చేసిన కామెంట్స్ మరింత నిప్పును రాజేశాయి. దీంతో తీవ్రస్థాయిలో ఆయనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాజమండ్రిలో ముంబయి తెలుగు సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ గరికపాటి నరసింహరావు ఈ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యాహ్న భోజనం పథకం అమలును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. పిల్లలకు మధ్యాహ్న భోజనం ఎక్కువైపోయిందని.. చదువు మిధ్యాహ్నం అయిపోయిందని అన్నారు. ‘భోజనంలో గుడ్డు పెట్టారా? గాడిద పెట్టారా? అన్నదే ముఖ్యమైపోయింది. అసలు అన్నం తినేవారికి కోడి గుడ్డు పెట్టడం ఏంటండి.. బుద్దుందా? లేదా? కోడిగుడ్డు కోసం వస్తారా మీరు. చదివితే చదవమను లేదంటే వెళ్లిపొమ్మను’ అంటూ విద్యార్థులను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
సనాతన ధర్మం మనం మాట్లాడే మాటలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది.సత్యం, ప్రియం, హితం పలకాలని బోధిస్తుంది. అబద్ధం, పరుష పదజాలం, ఇతరులను గాయపరిచే మాటలను నిషిద్ధంగా భావిస్తుంది. సనాతన ధర్మాన్ని పాటించే పండితులైన గరికపాటి గారు పసి పిల్లలపై మాట్లాడిన మాటలు సోచనీయం.
pic.twitter.com/cxVjNiY5aO— VZ Kumar (@VzKumar) March 21, 2026
మరోవైపు మాస్టార్లకు విద్యార్థులకు పెట్టిన గుడ్ల లెక్కలు రాయాల్సిన ఖర్మ పట్టిందని గరికపాటి వ్యాఖ్యానించారు. ‘అసలు పిల్లలకు భోజనాలు పెట్టడం ఏంటి? వారి భోజనం వారినే తెచ్చుకోమని చెప్పండి. లేదంటే మానేయమనండి. వారికి భోజనం, యూనిఫామ్, పుస్తకాలు ఇన్నీ ఫ్రీగా ఇస్తే వాళ్లు చదువుతారా? శోభనం రోజు పెళ్లి కొడుకులా మంచం ఎక్కి కూర్చుంటారు. విద్యార్థికి ఇన్ని సౌకర్యాలు అవసరమా? అందుకే ఎవరికి చదువు రావట్లేదు. భోజనాలే వస్తున్నాయి. ప్రభుత్వాల ఆలోచనలు కూడా మారాలి’ అంటూ చెప్పుకొచ్చారు.
గరికపాటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తల్లిదండ్రులతో పాటు నెటిజన్లు ఆయన మాటలను తప్పుబడుతున్నారు. మానవత్వం లేని పాండిత్యం వృథా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. విద్యార్థుల భోజనాల గురించి మాట్లాడటం దారుణమని వ్యాఖ్యానిస్తున్నారు. దేశంలో చాలా మంది పిల్లలు ఆకలి కారణంగానే చదువుకు దూరం అవుతున్నారని గుర్తుచేస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం కేవలం భోజనం మాత్రమే కాదని.. అది పిల్లల పోషకాహార లోపాన్ని (Malnutrition) తగ్గించి, వారిని బడికి వచ్చేలా ప్రోత్సహిస్తోందని గుర్తుచేస్తున్నారు.
Also Read: Induction Safety: ఇండక్షన్ స్టవ్‌పై వండిన ఆహారం పిల్లలకు పెట్టొచ్చా? ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
ఇదిలా ఉంటే గరికపాటి వివాదంపై ఆయన టీమ్ స్పందించినట్లుగా ఓ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఆయన మాటలను వక్రీకరించారని ఆయన టీమ్ పేర్కొంది. వేర్వేరు సందర్భాల్లో మాట్లాడిన మాటలను కలగలిపి ఈ వీడియోకు జతచేశారని.. వ్యతిరేక అర్థం వచ్చేలా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడింది. గురువు గారు ఎప్పుడు పేదల పక్షమే అని గుర్తుచేసింది. పేద పిల్లలను ఆదుకోవడానికి ధనవంతులు ముందుకు రావాలని ఆయన తన ప్రసంగంలో చాలాసార్లు పిలుపునిచ్చారని తెలిపింది. గురువుగారి హిందూ ధర్మ ప్రసంగాలను జీర్ణించుకోలేని కొందరు.. ఇటువంటి కుతంత్రాలకు పాల్పడతున్నారని ఆరోపించింది. కాబట్టి ఎవరూ వారి ట్రాప్ లో పడొద్దని గరికపాటి టీమ్ సూచించినట్లు ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
Also Read: Weather Update: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో ఉరుముల వాన, వీళ్లు బయటకు రావొద్దు!